కాశీబుగ్గలో రేపటి నుంచి పీడీఎస్‌యూ రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులు.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.
పలాస, జూలై 9:
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక శిక్షణా తరగతులు శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు కాశీబుగ్గలోని టీకేఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె. భాస్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వినోద్ కుమార్ తెలిపారు.
గురువారం పలాసలోని సూదికొండ కాలనీలో ఉన్న పీడీఎస్‌యూ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. విద్యారంగంలో చోటుచేసుకుంటున్న మార్పులు, శాస్త్రీయ దృక్పథం, లౌకిక, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, ఉపాధి ఆధారిత విద్యపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
శిక్షణా తరగతుల ప్రారంభ సమావేశంలో ఆంధ్ర యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు సురప్పడు ప్రారంభోపన్యాసం చేయనున్నట్లు తెలిపారు. 'ఉన్నత విద్య – ఉపాధి సవాళ్లు' అంశంపై అఖిల భారత విద్యా హక్కుల వేదిక నాయకుడు రమేష్ పట్నాయక్, 'జాతీయ–అంతర్జాతీయ పరిస్థితులు'పై పి. ప్రసాద్, 'సామాజిక మార్పులో విద్యార్థుల పాత్ర'పై ఏపీటీఎఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సన్నశెట్టి రాజశేఖర్ ప్రసంగించనున్నారని వివరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా విధానాలపై సమగ్ర చర్చతో పాటు భవిష్యత్ కార్యాచరణపై ఈ శిక్షణా తరగతుల్లో నిర్ణయాలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వీరేంద్ర ప్రసాద్, రాష్ట్ర నాయకులు ప్రసాద్, రమణ, శంకర్, జిల్లా నాయకులు విజయ్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
