మేరా యువ భారత్‌తో యువతకు సేవా స్ఫూర్తి.
పలాసలో అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా అధికార ప్రతినిధి శంకర్ తమ్మినాన.
పలాస, జూలై 4 (న్యూస్): యువత వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజ సేవలోనూ ముందుండాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని చినబడం మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన మేరా యువ భారత్ (My Bharat) నమోదు అవగాహన కార్యక్రమం, ప్రభుత్వ రక్తదాన వాహనం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువజన క్లబ్‌ల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువతను ఒకే వేదికపైకి తీసుకువచ్చి నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, సేవా భావాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం మేరా యువ భారత్ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రతి యువకుడు ఈ వేదికలో నమోదు చేసుకుని తన ప్రతిభను సమాజ ప్రయోజనాలకు వినియోగించాలని సూచించారు.
జిల్లా యువజన అధికారి నమ్మల కృష్ణ మాట్లాడుతూ యువజన క్లబ్‌ల ద్వారా డిజిటల్ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, స్వయం ఉపాధిపై శిక్షణలతో పాటు రక్తదాన శిబిరాలు, మొక్కల నాటకం, గ్రామాల పరిశుభ్రత వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యేతో పాటు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులను నిర్వాహకులు దుశ్శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, ఏఎంసీ చైర్మన్ మల్ల శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ పీరికట్ల విఠల్, మండల అధ్యక్షుడు బడ్డ నాగరాజు, కార్యదర్శి సప్ప నవీన్, గాలి కృష్ణ, ఇతర నాయకులు, అధికారులు, యువత, పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు.

