వర్షానికే బురదమయం.. కేసుపురం రహదారిపై నరకయాతన.


 వర్షానికే బురదమయం.. కేసుపురం రహదారిపై నరకయాతన.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా అధికార ప్రతినిధి శంకర్ తమ్మినాన.

- అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి.

- బ్రాహ్మణతర్ల–టెక్కలిపట్నం–గొప్పిలి మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం.

- వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజల విజ్ఞప్తి.

పలాస, జులై 3: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేసుపురం గ్రామంలోని ప్రధాన రహదారి అధ్వాన్న స్థితికి చేరడంతో గ్రామస్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రాహ్మణతర్ల నుంచి టెక్కలిపట్నం, గొప్పిలి గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోక గుంతలమయంగా మారింది.

కొద్దిపాటి వర్షం కురిసినా రహదారి పూర్తిగా బురదమయంగా మారి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. ద్విచక్ర వాహనదారులు జారిపడుతుండగా, ఆటోలు, కార్లు, ఇతర వాహనాలు కూడా రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వర్షపు నీరు గుంతల్లో నిలిచిపోవడంతో రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారిందని స్థానికులు చెబుతున్నారు.

ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో రోగులను ఆసుపత్రులకు తరలించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పలుమార్లు సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమస్యను వివరించినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలం నేపథ్యంలో పరిస్థితి మరింత దారుణంగా మారడంతో సంబంధిత ఆర్ అండ్ బి (R&B) అధికారులు తక్షణమే స్పందించి రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని గ్రామస్తులు, వాహనదారులు కోరుతున్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post