రైతాంగ సమస్యల పరిష్కారమే ఏఐకేఎంఎస్ మహాసభల లక్ష్యం.


 రైతాంగ సమస్యల పరిష్కారమే ఏఐకేఎంఎస్ మహాసభల లక్ష్యం.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన 

జూలై 25న శ్రీకాకుళంలో జిల్లా 11వ మహాసభలు – రైతులు,ప్రజాస్వామికవాదులు పెద్దఎత్తున పాల్గొనాలి : రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంకల మాధవరావు.

పలాస, జూలై 18 (వార్త): రైతాంగ సమస్యల పరిష్కారానికి ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) శ్రీకాకుళం జిల్లా 11వ మహాసభలను ఈ నెల 25న శ్రీకాకుళం నగరంలోని కళింగ భవన్‌లో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంకల మాధవరావు తెలిపారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజాస్వామికవాదులు అధిక సంఖ్యలో హాజరై మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక భవనం వద్ద శనివారం మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థల ఆధీనంలోకి తీసుకెళ్లే విధానాలు రైతాంగ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని విమర్శించారు. రైతుల పోరాటాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు.

రైతులకు గిట్టుబాటు ధర, సంపూర్ణ రుణమాఫీ, దున్నేవారికే భూమి, వ్యవసాయ రంగానికి తగిన బడ్జెట్ కేటాయింపులు, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి వంటి డిమాండ్ల సాధన కోసం ఏఐకేఎంఎస్ నిరంతరం ఉద్యమిస్తోందన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యవసాయాభివృద్ధికి వంశధార ప్రాజెక్టును ఇచ్చాపురం వరకు విస్తరించడంతో పాటు వంశధార–నాగావళి నదుల అనుసంధానం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

జిల్లా విభజనతో నష్టపోయిన ఆదివాసీలకు ప్రత్యేక ఐటిడిఏ ఏర్పాటు చేయడం, వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని సమర్థంగా అమలు చేయడం, ఆదివాసీ గ్రామాలను ఐదో షెడ్యూల్‌లో చేర్చడం వంటి అంశాలపై కూడా తమ సంఘం పోరాటం కొనసాగిస్తోందన్నారు. సోంపేట, కాకరాపల్లి ప్రాంతాల్లో కాలుష్యకర పరిశ్రమలకు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు.

జూలై 25న జరిగే జిల్లా మహాసభల్లో రైతాంగ సమస్యలు, సాగునీటి వనరుల అభివృద్ధి, వ్యవసాయ సంక్షోభ నివారణ, రైతు సంక్షేమం, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై సమగ్రంగా చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు గొరకల బాలకృష్ణ, మామిడి భీమారావు, ఎస్. బంగ్లా కుమార్, మురిపింటి తాతారావు, కామేశు, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ, ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జుత్తు వీరాస్వామి, కోశాధికారి పోతనపల్లి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post