శ్రీకాకుళం జిల్లా తొలి మహిళా బాక్సింగ్ కోచ్‌గా గేయామృతకు అరుదైన అవకాశం.


 శ్రీకాకుళం జిల్లా తొలి మహిళా బాక్సింగ్ కోచ్‌గా గేయామృతకు అరుదైన అవకాశం.

ఎన్‌ఐఎస్ కోచ్ శిక్షణకు పంజాబ్‌లోని పటియాలాకు ఎంపిక.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.

టెక్కలి, జూలై 17 :

శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువ క్రీడాకారిణి బొడ్డ గేయామృత అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. జిల్లా నుంచి ఎన్‌ఐఎస్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్) బాక్సింగ్ కోచ్ శిక్షణకు ఎంపికైన తొలి మహిళా బాక్సర్‌గా ఆమె నిలవడం జిల్లా క్రీడా రంగానికి గర్వకారణంగా మారింది.

టెక్కలి మండలం బన్నువాడ గ్రామానికి చెందిన గేయామృత సాధారణ కుటుంబంలో జన్మించినప్పటికీ, తన కృషి, పట్టుదలతో జాతీయ స్థాయికి ఎదిగింది. తల్లిదండ్రులు నాగేశ్వరరావు, లచ్చన్నమ్మ ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే బాక్సింగ్‌తో పాటు టైక్వాండోలో శిక్షణ పొందింది. ప్రస్తుతం ఆమె బీటెక్ చివరి సంవత్సరం చదువుతూనే క్రీడల్లోనూ రాణిస్తోంది.

ఈ నెల 13వ తేదీ నుంచి పంజాబ్ రాష్ట్రంలోని పటియాలాలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక ఎన్‌ఐఎస్ బాక్సింగ్ కోచ్ శిక్షణలో పాల్గొనేందుకు గేయామృత ఎంపికైంది. ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) దేశవ్యాప్తంగా ప్రతిభ కనబర్చిన వంద మంది క్రీడాకారులను మాత్రమే ఎంపిక చేసి కోచ్‌లుగా తీర్చిదిద్దే ఈ శిక్షణకు ఆమె ఎంపిక కావడం విశేషమని టెక్కలి ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం ప్రధాన శిక్షకుడు నర్సిపురం శేఖర్ తెలిపారు.

గేయామృత చిన్నతనంలో ప్రతిరోజూ తన గ్రామం నుంచి సైకిల్‌పై టెక్కలికి వచ్చి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకుంటూనే క్రీడల్లో కఠోర సాధన చేసిందని ఆయన గుర్తు చేశారు. ఆమె విజయం గ్రామీణ ప్రాంతాల యువతకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

పటియాలా శిక్షణకు అవసరమైన క్రీడా సామగ్రిని జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి (డీఎస్‌డీవో) మహేష్‌బాబు అందజేసి గేయామృతను అభినందించారు. ఆమె జాతీయ స్థాయిలో మరింత ఉన్నత విజయాలు సాధించి జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post