అమరావతి ఛాంపియన్‌షిప్–2026 నియోజకవర్గ స్థాయి ఎంపికలకు శ్రీకారం.
యువ క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.
పలాస, జూలై 20:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్‌షిప్–2026 నియోజకవర్గ స్థాయి క్రీడా ఎంపికలను సోమవారం పలాసలో ఏపీటీపీసీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వజ్జ బాబూరావు ప్రారంభించారు. పలాస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరిగిన కార్యక్రమంలో క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలకు శ్రీకారం చుట్టారు.
అండర్–17, అండర్–23 విభాగాల్లో నిర్వహించిన ఈ ఎంపికల్లో పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాలతో పాటు పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధికి చెందిన వందలాది మంది బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. వాలీబాల్, కబడ్డీ, బాక్సింగ్, హాకీ, అథ్లెటిక్స్, ఖోఖో, యోగా, బాస్కెట్‌బాల్, వెయిట్‌లిఫ్టింగ్, చదరంగం, బ్యాడ్మింటన్ తదితర క్రీడాంశాల్లో ఎంపికలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వజ్జ బాబూరావు మాట్లాడుతూ, క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమరావతి ఛాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తోందని తెలిపారు. యువ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించి పలాస నియోజకవర్గానికి, శ్రీకాకుళం జిల్లాకు కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికవుతారని, అక్కడ కూడా అత్యుత్తమ ప్రదర్శన చేసి రాష్ట్ర స్థాయికి అర్హత సాధించాలని సూచించారు. క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహం, మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు, కొరికాన శంకరరావు, పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు తారక్, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా శిక్షకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
యువ క్రీడాకారుల ఉత్సాహంతో క్రీడా మైదానం సందడిగా మారగా, అధికారులు పారదర్శకంగా ఎంపికల ప్రక్రియను నిర్వహించారు. జిల్లా స్థాయి పోటీల్లో పలాస నియోజకవర్గ క్రీడాకారులు విశేష ప్రతిభ కనబర్చాలని పలువురు ఆకాంక్షించారు.


