విద్యాలయాలా.. వ్యాపార కేంద్రాలా..?
ఫీజుల పేరిట తల్లిదండ్రులపై పెరుగుతున్న భారం.
పుస్తకాలు, దుస్తులు, బూట్ల విక్రయాలతో అదనపు దోపిడీ.
సగం ఫీజు చెల్లిస్తేనే ప్రవేశ మంటున్న యాజమాన్యాలు రసీదులు ఇవ్వకుండానే వసూళ్లపై ఆరోపణలు.
చోద్యం చూస్తున్న విద్యాశాఖ అధికారులపై విమర్శలు.
పులివెందుల జులై 1,త్రీలోకేష్, క్రైమ్ 9 మీడియా ప్రతినిధి.
కొత్త విద్యా సంవత్సర ప్రారంభంలో ప్రైవేటు విద్యాసం జేబులకు చిల్లులు పెడుతున్నా యనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా మార్చేసిన కొన్ని ప్రైవేటు పాఠశాలలు ప్రవేశాల పేరుతో భారీగా రుసుములు వసూలు చేస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా పుస్తకాలు, దుస్తులు, బూట్లు, మెడ పట్టీలు, నడుము పట్టీలు కూడా తమ వద్దనే కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు తల్లి దండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ప్రవేశాల సమయంలోనే మొత్తం రుసుములో సగం మొత్తాన్ని ముందుగానే చెల్లించాలని యాజమా న్యాలు ఒత్తిడి తెస్తున్నాయని తల్లిదండ్రులు చెబుతు న్నారు. రుసుము చెల్లించకపోతే దుస్తులు కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. దీంతో మధ్యతర గతి, పేద కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
పాఠశాలల్లోనే పుస్తకాల విక్రయాలు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం తల్లిదండ్రులు తమకు నచ్చిన దుకాణాల్లో పుస్తకాలు, దుస్తులు కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ ఉండాలి. అయితే కొన్ని ప్రైవేటు పాఠశాలలు తమ పాఠశాల పేరుతో ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాలు, దుస్తులను విద్యార్థులు తప్ప నిసరిగా తమ వద్దనే కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మార్కెట్ ధరల కంటే అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నా యని తల్లిదండ్రులు చెబుతున్నారు.
రసీదులు ఇవ్వని యాజమాన్యాలు ?
పుస్తకాలు, దుస్తులు, బూట్లు, ఇతర వస్తువులు కొనుగోలు చేసినప్పటికీ అనేక చోట్ల సరైన రసీదులు ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి. చెల్లించిన మొత్తాలకు ఆధారాలు లేకపోవడంతో భవిష్యత్తులో ఫిర్యాదు చేసే అవకాశమూ లేకుండా పోతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యా హక్కుపై వ్యాపార ముద్ర.
విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఏ షరతుల నైనా అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు అంటున్నారు. పిల్లల చదువు కోసం అప్పులు చేసి అయినా రుసుములు చెల్లిస్తున్నామని, కానీ ప్రతి సంవత్సరం కొత్త పుస్తకాలు, కొత్త దుస్తుల పేరుతో వేల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.
విద్యాశాఖ పర్యవేక్షణ ఎక్కడ?
ప్రైవేటు పాఠశాలల రుసుముల నియంత్రణ, నిబంధ నల అమలు, తల్లిదండ్రుల ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలను పర్యవేక్షించాల్సిన విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదనే విమర్శలు వ్యక్త మవుతున్నాయి. పాఠశాలల్లో జరుగుతున్న రుసుముల వసూళ్లు, పుస్తకాల విక్రయాలు, దుస్తుల వ్యాపారాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అక్రమా లకు అడ్డుకట్ట వేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. "విద్యాలయాలు విద్యాబోధన కేంద్రాలా..? వ్యాపార కేంద్రాలా..? పుస్తకాలు, బూట్లు, దుస్తుల విక్రయాలే ప్రధాన లక్ష్యమైతే విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుంది?" అంటూ తల్లి దండ్రులు ప్రశ్నిస్తున్నారు.
