చిత్తూరు కామన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ పార్కును సందర్శించిన ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి శంకర్ తమ్మినాన.
రైతులకు మెరుగైన గిట్టుబాటు – ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలకు ఊతం – ఎగుమతుల ప్రోత్సాహమే ప్రభుత్వ లక్ష్యం.
చిత్తూరు, జూలై 28:
చిత్తూరు జిల్లా కేంద్రంగా పండ్లు, కూరగాయల విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ కోసం ఏర్పాటు చేసిన సమీకృత కామన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ (CIF) పార్కును ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ (ఏపీటీపీసీ) చైర్మన్ వజ్జ బాబూరావు మంగళవారం సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. యూనిట్‌లో జరుగుతున్న కార్యకలాపాలు, ప్రాసెసింగ్ సామర్థ్యం, రైతులకు అందుతున్న సేవలు, భవిష్యత్ విస్తరణ అవకాశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వజ్జ బాబూరావు మాట్లాడుతూ, చిత్తూరు జిల్లాలో పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, పల్ప్ ఎక్స్‌ట్రాక్షన్ కోసం అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం గతంలో పలు కారణాలతో నిలిచిపోయిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఈ-టెండరింగ్ విధానంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (O&M) ఆపరేటర్‌ను ఎంపిక చేసి యూనిట్‌ను విజయవంతంగా పునరుద్ధరించి తిరిగి కార్యకలాపాలు ప్రారంభించిందని పేర్కొన్నారు.
ఈ ఫెసిలిటీ పునరుద్ధరణతో రైతులు తమ పంటలకు మెరుగైన గిట్టుబాటు ధరలు పొందే అవకాశం ఏర్పడిందని, పండ్లు, కూరగాయలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే అవకాశాలు విస్తరించాయని చెప్పారు. దీనివల్ల ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలకు మరింత ఊతం లభించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయని వివరించారు.
వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించి రైతుల ఆదాయాన్ని పెంచడం, ఎగుమతులను ప్రోత్సహించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఆ దిశగా చిత్తూరు కామన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ పార్కు కీలక పాత్ర పోషిస్తుందని, భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేలా చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
అనంతరం యూనిట్‌లోని పల్ప్ ఎక్స్‌ట్రాక్షన్, ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్, నాణ్యత నియంత్రణ విభాగాలను పరిశీలించిన వజ్జ బాబూరావు, రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ పర్యటనలో తాజా ఫుడ్ ప్రాసెసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈశ్వర్ నాథ్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


