గురుభక్తికి నిదర్శనంగా పూర్వ విద్యార్థి గురుదక్షిణ.


 గురుభక్తికి నిదర్శనంగా పూర్వ విద్యార్థి గురుదక్షిణ.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.

నిరుపేద విద్యార్థి నుంచి విదేశాల్లో ఉన్నత ఉద్యోగం... విద్యాసంస్థకు ఏటా చేయూత.

పలాస, జూలై 10: విద్యను అందించి జీవితానికి బాటలు వేసిన గురువుల పట్ల కృతజ్ఞతను చాటుకుంటూ ఓ పూర్వ విద్యార్థి ప్రతి ఏడాది తన విద్యాసంస్థకు గురుదక్షిణ సమర్పించడం ఆదర్శంగా నిలుస్తోంది. పలాసకు చెందిన ప్రతిభ జూనియర్ కళాశాల, షిరిడీ సాయి డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి దశమంతుల సూర్యనారాయణ విదేశాల్లో ఉన్నత ఉద్యోగంలో స్థిరపడిన అనంతరం కూడా తన విజయానికి పునాది వేసిన గురువులను మరువకుండా విద్యాసంస్థకు చేయూత అందిస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్య కొనసాగించడం కష్టసాధ్యమైన సమయంలో కళాశాల యాజమాన్యం అండగా నిలవడంతో సూర్యనారాయణ ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యను పూర్తి చేశారు. ప్రస్తుత మదర్ థెరీసా హైస్కూల్ ప్రిన్సిపాల్ వజ్జ గంగాభవాని, ఏపీటీపీసీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వజ్జ బాబూరావు అందించిన ప్రోత్సాహం తన జీవితాన్ని మలిచిందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం విదేశాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, ప్రతి ఏడాది స్వదేశానికి వచ్చిన సందర్భంగా విద్యాసంస్థను సందర్శించి తనకు చేతనైన ఆర్థిక సహాయాన్ని గురుదక్షిణగా అందించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది కూడా మదర్ థెరీసా హైస్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో వజ్జ గంగాభవాని, వజ్జ బాబూరావులకు గురుదక్షిణను అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, గురువు చేసిన మేలును మరువకుండా కృతజ్ఞతతో స్పందించడం ప్రతి విద్యార్థికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. దశమంతుల సూర్యనారాయణ గురుభక్తి నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ, "సీతారాములకు హనుమంతుడిలా సేవ చేయలేకపోయినా, ఉడతలా నా వంతు చేయూత అందించాలనే భావనతో ఈ చిన్న గురుదక్షిణ సమర్పిస్తున్నాను" అని పేర్కొన్నారు. ఆయన మాటలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post