SIRపై ఆందోళన అవసరం లేదు: ఎమ్మెల్యే గౌతు శిరీష.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.
పలాస, జూలై 10: ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర పరిశీలన (SIR) ప్రక్రియపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
శుక్రవారం పలాసకు చెందిన మైనార్టీ ప్రతినిధులు వారిని కలిసి SIR ప్రక్రియలో 2002 నాటి కుటుంబ, పూర్వీకుల వివరాలు సమర్పించాలని కోరుతున్నప్పటికీ, తమ వద్ద ఆ పత్రాలు లేవని వివరించారు. ప్రస్తుతం ఉన్న ఆధార్ కార్డు తదితర గుర్తింపు పత్రాలను పరిగణనలోకి తీసుకుని ఓటరు ధృవీకరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే గౌతు శిరీష, వజ్జ బాబూరావు మాట్లాడుతూ సమస్యను ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లి, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. అర్హులైన ఏ ఒక్క ఓటరికి కూడా అన్యాయం జరగకుండా ప్రభుత్వం, ఎన్నికల యంత్రాంగంతో సమన్వయం చేస్తామని చెప్పారు.
SIR ప్రక్రియపై అపోహలు, భయాందోళనలకు తావు లేదని, సందేహాలు ఉంటే సంబంధిత అధికారులు లేదా ప్రజాప్రతినిధులను సంప్రదించాలని వారు సూచించారు.

