వంశధార జలాలకు జలహారతి.. రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే గౌతు శిరీష.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.
పలాస, జూలై 12: హిరమండలం రిజర్వాయర్ నుంచి వంశధార జలాలను విడుదల చేయడంతో పలాస మండల పరిధిలోని టెక్కలి ప్రధాన కాలువలో నీరు ప్రవహించింది. ఈ సందర్భంగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి కాలువ వద్ద జలహారతి నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, పలాస ప్రాంత రైతులకు సాగునీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందన్నారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వంశధార ఏడో కాలువ ద్వారా సాగునీటిని అందిస్తున్నట్లు తెలిపారు. రైతుల పొలాలకు సమృద్ధిగా నీరు చేరి ఖరీఫ్ పంటలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుపై ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లు మంత్రిగా ఉన్నప్పటికీ పలాస రైతులకు వంశధార నీటిని అందించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుని సాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు.
పలాస ప్రాంతానికి వంశధార జలాలు అందించడంలో సహకరించిన జిల్లా కలెక్టర్, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాలువలో వంశధార జలాలు ప్రవహించడంతో పలాస ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తూ, ఖరీఫ్ సాగుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.


