శతాధిక మాజీ సర్పంచ్ తామాడ పాపుడమ్మ కన్నుమూత.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా అధికార ప్రతినిధి శంకర్ తమ్మినాన.
పలాస, జులై 1: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు, మాజీ సర్పంచ్ తామాడ పాపుడమ్మ (106) మంగళవారం సాయంత్రం స్వగృహంలో వృద్ధాప్యంతో కన్నుమూశారు. ఆమె మృతి పట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మహిళలు ప్రజాప్రతినిధులుగా ముందుకు రావడం అరుదైన రోజుల్లోనే భర్త పోలినాయుడు ప్రోత్సాహంతో పాపుడమ్మ గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై సేవలందించారు. గ్రామాభివృద్ధితో పాటు సామాజిక సేవలోనూ విశేష కృషి చేశారు. అగ్నికుల క్షత్రియ సంఘంలో కుల పెద్దగా వ్యవహరిస్తూ అనేక కుటుంబాలకు మార్గదర్శకత్వం వహించారు.
పాపుడమ్మకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె కుమార్తె తామాడ సరస్వతి కూడా బాతుపురం సర్పంచ్‌గా పనిచేసి ప్రజాసేవలో గుర్తింపు పొందారు. ఉత్తరాంధ్రలో ప్రత్యేక గాయనిగా కూడా సరస్వతి సుపరిచితురాలు.
పాపుడమ్మ మృతి విషయం తెలిసిన వెంటనే బంధుమిత్రులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఆమె నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. ఉద్దానం సాహితీ సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు లండ రుద్రమూర్తి, కార్యదర్శి శివజ్యోతి, వంకల రాజారావు, వినోద్, సాగూరు నారాయణస్వామి, మురుపెల్లి బాబురావు, చిక్కోలు జగదీష్ తదితరులు ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
