లక్కీ స్కీమ్ ముసుగులో రూ.80 లక్షల మోసం.


 లక్కీ స్కీమ్ ముసుగులో రూ.80 లక్షల మోసం.

కాశీబుగ్గలో నిర్వాహకుడి అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.

పలాస/కాశీబుగ్గ, జూలై 8: లక్కీ స్కీమ్ పేరుతో అమాయక ప్రజలను ఆకర్షించి సుమారు రూ.80 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన వ్యక్తిని కాశీబుగ్గ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసులు వెల్లడించారు.

పోలీసుల వివరాల మేరకు.. నిందితుడు 2023 మార్చిలో 'కారుణ్య మొబైల్ లక్కీ స్కీమ్' పేరుతో డిపాజిట్ పథకాన్ని ప్రారంభించాడు. ఈ పథకంలో దాదాపు 200 మంది సభ్యులను చేర్చుకుని, ప్రతి సభ్యుడి నుంచి నెలకు రూ.700 చొప్పున వసూలు చేశాడు. పథకం గడువు ముగిసిన తర్వాత మెచ్యూరిటీ మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తామని నమ్మబలికాడు.

అయితే 2026 మేలో పథకం గడువు ముగిసినప్పటికీ సభ్యులకు చెల్లించాల్సిన డబ్బు ఇవ్వకుండా కార్యాలయాన్ని మూసివేసి, మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. దీంతో బాధితులు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, తమకు సుమారు రూ.80 లక్షల మేర నష్టం జరిగిందని పేర్కొన్నారు.

ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడి ఆచూకీ గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. అధిక లాభాలు, ఆకర్షణీయమైన బహుమతులు, లక్కీ స్కీమ్‌ల పేరుతో నిర్వహించే అనధికారిక డిపాజిట్ పథకాలను నమ్మి పెట్టుబడులు పెట్టవద్దని సూచించారు. పెట్టుబడులు పెట్టే ముందు సంబంధిత సంస్థకు ప్రభుత్వ అనుమతులు, చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ ఉన్నాయో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని కోరారు.

అనుమతులు లేకుండా డిపాజిట్ పథకాలు, చిట్టీలు నిర్వహిస్తూ ప్రజలను మోసం చేసే వారిపై చీటింగ్ కేసులతో పాటు బడ్స్ చట్టం (BUDS Act) కింద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post