పేద గొర్రెల కాపరి కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం.



 పేద గొర్రెల కాపరి కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం.

మంత్రి సొంత నిధుల నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయం.. నిందితులను కాపాడే ప్రయత్నాలు దుర్మార్గం: మంత్రి కొలుసు పార్థసారథి.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి శంకర్ తమ్మినాన 

పలాస, జూలై 22 : రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పేద గొర్రెల కాపరి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చారు. ప్రమాదంలో కుటుంబ పెద్దను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబానికి తన సొంత నిధుల నుంచి రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించి అందజేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, గొర్రెల కాపరుల సమాజం అండగా నిలుస్తారని స్పష్టం చేశారు.

పలాసలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మృతుడు నెలకు కేవలం రూ.8 వేల ఆదాయంతో జీవించే నిరుపేద గొర్రెల కాపరి అని, అతనికి కనీసం ఒక సెంట్ భూమి కూడా లేదని తెలిపారు. తాను కూడా గొర్రెల కాపరి కుటుంబం నుంచే ఎదిగిన వ్యక్తినని, అలాంటి కుటుంబాల కష్టాలు తనకు బాగా తెలుసని పేర్కొన్నారు.

ప్రమాదానికి కారణమైన 18 ఏళ్లు నిండిన మేజర్ యువకుడు అతివేగంగా బైక్ నడపడం వల్ల అమాయకుడి ప్రాణం పోయిందని ఆరోపించారు. అలాంటి ఘటనలో అసలు నిందితుడిని రక్షించేందుకు వేరొకరిని కేసులో ఇరికించే ప్రయత్నాలు చేయడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. చట్టాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలను ప్రభుత్వం ఏమాత్రం సహించదని స్పష్టం చేశారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పాల్సిన ప్రతిపక్ష నాయకులు, ప్రమాదానికి కారణమైన వారిని వెనకేసుకొస్తూ మాట్లాడడం బాధాకరమని మంత్రి విమర్శించారు. నేరాలకు పాల్పడిన వారిని ప్రోత్సహించే రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్న మంత్రి, బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, రాష్ట్రంలోని గొర్రెల కాపరుల సమాజం, పార్టీ నాయకులు కలిసి బాధిత కుటుంబానికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తారని తెలిపారు.

తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు ఎవరూ అతీతులు కారని, నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం వెన్నంటి ఉంటుందని, తక్షణ ఉపశమనంగా తన సొంత నిధుల నుంచి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post