ఇందిరా చౌక్ వార్డులో పోలీసుల అవగాహన కార్యక్రమం.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన .
పలాస, జూన్ 4:
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఎస్సై ఆర్. నరసింహమూర్తి ఆధ్వర్యంలో గురువారం ఇందిరా చౌక్ వార్డులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై నరసింహమూర్తి, పోలీసు సిబ్బందితో కలిసి వార్డును సందర్శించి స్థానికులతో సమావేశమయ్యారు. మహిళా సాధికారత (నారీ శక్తి), కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కొత్త చట్టాలు, ఎన్నికల సమయంలో పాటించాల్సిన నిబంధనలపై ప్రజలకు వివరించారు.
అలాగే దేవాలయాలు, మసీదులు, చర్చిల వంటి ప్రార్థనా మందిరాల వద్ద భద్రతా చర్యల్లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామంలో జరిగే పండుగలు, ఉత్సవాలు, మతపరమైన కార్యక్రమాల సమాచారాన్ని ముందుగానే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, బెట్టింగ్ యాప్స్, పేకాట, గంజాయి, నాటుసారా అక్రమ రవాణా మరియు విక్రయాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నిర్మూలన, మహిళల భద్రత, మహిళలపై జరిగే నేరాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో 112 సేవల వినియోగం వంటి అంశాలపై కూడా ప్రజలకు వివరించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, వార్డు పెద్దలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
