పలాస మండలం వీరభద్రాపురంలో తీవ్ర ఉద్రిక్తత.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
నోటీసులు ఇవ్వకుండా జేసీబీతో కూల్చేశారని బాధితురాలి కన్నీరు.
తహసీల్దార్ శ్రీదేవిని అడ్డుకుని నిలదీసిన గ్రామస్తులు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం వీరభద్రాపురం గ్రామంలో గురువారం రాత్రి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, నిర్మాణంలో ఉన్న ఒక నిరుపేద ఇంటిని రెవెన్యూ అధికారులు అర్ధరాత్రి పూట జేసీబీతో కూల్చివేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అధికారుల తీరుపై గ్రామమంతా ఒక్కటై రెవెన్యూ సిబ్బందిని, ఎమ్మార్వోను గ్రామస్తులు అడ్డుకుని నిలదీశారు.
అసలేం జరిగింది..?
వీరభద్రాపురం గ్రామానికి చెందిన బమ్మిడి కృష్ణారావు అనే వ్యక్తి తన సోదరి విమలకుమారికి 'పసుపు కుంకుమ' కానుక కింద గ్రామంలో ఇల్లు నిర్మించుకునేందుకు కొంత భూమిని ఇవ్వగా ఆ స్థలంలో విమలకుమారి ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. గతంలో జరిగిన రెవెన్యూ సదస్సులో నాటి ఎమ్మార్వో ఇల్లు నిర్మించుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేయడంతో, బాధితులు అన్ని పత్రాలు సిద్ధం చేసుకుని ఈ ఏడాది ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించగా,
కొద్దిరోజుల క్రితమే పలాస తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన బి. శ్రీదేవి, గురువారం రాత్రి తన సిబ్బంది మరియు జేసీబీతో సహా అకస్మాత్తుగా గ్రామానికి చేరుకుని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే నిర్మాణంలో ఉన్న ఇంటిని రాత్రికి రాత్రే కూల్చివేశారంటూ లబోదిబోమంటున్నారు.
తన భర్త ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగోలేదని, తమవద్ద అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మా ఇంటిని కూల్చేసి మమ్మల్ని రోడ్డున పడేశారంటూ బాధితురాలు వాపోయారు. ఈ కూల్చివేత వల్ల లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తమకు న్యాయం చేసి నష్టపరిహారం అందించాలని, లేదంటే ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ విమలకుమారి అధికారులను హెచ్చరించారు.
తహసీల్దార్‌ను అడ్డుకున్న గ్రామస్తులు:
అర్ధరాత్రి పూట జరిగిన ఈ అన్యాయాన్ని చూసి ఆగ్రహించిన గ్రామస్తులంతా బాధితురాలికి బాసటగా నిలిచారు. పలాస తహసీల్దార్ బి. శ్రీదేవిని, రెవెన్యూ సిబ్బందిని చుట్టుముట్టి తీవ్రస్థాయిలో నిలదీశారు. పగటిపూట కాకుండా చీకట్లో వచ్చి కూల్చివేయాల్సినంత అత్యుత్సాహం ఎందుకని, దీని వెనుక ఉన్న ఆంతర్యమేమిటని గ్రామస్తులు గట్టిగా ప్రశ్నించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
రంగంలోకి దిగిన పోలీసులు:
పరిస్థితి చేతులు దాటుతుండటంతో సమాచారం అందుకున్న కాశీబుగ్గ పోలీసులు వెంటనే వీరభద్రాపురం గ్రామానికి చేరుకున్నారు. ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులను నచ్చజెప్పి, అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి పూట దౌర్జన్యంగా ఇల్లు కూల్చివేసిన తహసీల్దార్ శ్రీదేవి చర్యలపై జిల్లా కలెక్టర్‌కు అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు బాధితురాలు మరియు గ్రామ పెద్దలు స్పష్టం చేశారు.
ముందోస్తూ నోటీసు ఇచ్చారా అని ఎమ్ ర్ ఓ కు విలేకర్ అడిగిన ప్రశ్నకి లిఖిత పూర్వకంగా ఇవ్వలేదని భౌతికంగా తెలియజేశామని వివరణ ఇచ్చారు.


