రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం.. గ్రామాల్లో విషాదఛాయలు.


రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం.. గ్రామాల్లో విషాదఛాయలు.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

వజ్రపుకొత్తూరు, జూన్ 22: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని చిన్న తామాడపేట సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

పోలీసుల వివరాల ప్రకారం, సైనూరు గ్రామంలో జరుగుతున్న గ్రామదేవత ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం అర్ధరాత్రి వేళ ఇద్దరు యువకులు ఒకే బైక్‌పై తమ స్వగ్రామాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు. చిన్న తామాడపేట సమీపానికి చేరుకోగానే బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

మృతులను గోపీనాథపురం గ్రామానికి చెందిన కర్ని కోదండరావు (28), గర్తంవానిపేట గ్రామానికి చెందిన గర్తం మణికంఠ (33)గా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న వజ్రపుకొత్తూరు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి అధిక వేగమే కారణమా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

ఇద్దరు యువకుల ఆకస్మిక మృతితో వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుల స్వగ్రామాలైన గోపీనాథపురం, గర్తంవానిపేటల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుని మృతులకు నివాళులర్పించారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post