టీడీపీ హామీలపై - వైసీపీ నిరసన..!
శంకర్ క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన .
మందస, జూన్ 5:
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పలాస నియోజకవర్గంలోని మందసలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యాయి.
"టీడీపీ వెన్నుపోటుకు రెండేళ్లు" అనే నినాదంతో చేపట్టిన ఈ ఆందోళనలో పాల్గొన్న నాయకులు రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. అనంతరం నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ, అధికారంలోకి రావడానికి టీడీపీ ఇచ్చిన హామీలు ఇప్పటికీ కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. మహిళలు, రైతులు, యువత, వృద్ధులకు ప్రకటించిన పథకాల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.
ప్రజలను ఆకట్టుకునేందుకు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను ఇప్పుడు ప్రభుత్వం పక్కన పెట్టిందని విమర్శించారు. ఇచ్చిన హామీల అమలుపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
పలాస నియోజకవర్గంలోని మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీకి మించి ధరలు వసూలు చేస్తున్నారని ప్రజల జేబులకు గండికొడుతూ అదనపు భారం మోపుతూ బాటిల్ కి రూ.10 చొప్పనా వసూలు చేసి సంవత్సరానికి సుమారు 12 కోట్లు పేదవాడి కష్టాన్ని మద్యం రూపంలో దోచుకుంటున్నారని మండిపడ్డారు.ఇది అక్రమ వసూళ్లు కాదు అక్క వసూళ్లు అని ఎద్దేవా చేసారు. రాష్ట్రంలో పెరుగుతున్న ధరలు, నిరుద్యోగ సమస్యలు, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.ప్రజలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
అనంతరం వైసీపీ కార్యకర్తలు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను దహనం చేసేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు.
కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
.jpeg)
