విశాఖపట్నం రేంజ్‌లో మాదకద్రవ్యాల నిర్మూలనకు బహుముఖ వ్యూహం – ‘జీరో కల్టివేషన్’ సాధనే లక్ష్యం.



 విశాఖపట్నం రేంజ్‌లో మాదకద్రవ్యాల నిర్మూలనకు బహుముఖ వ్యూహం – ‘జీరో కల్టివేషన్’ సాధనే లక్ష్యం.

నేడు 490 కేసులకు సంబంధించిన రూ. కోట్లాది విలువైన 20,876 కిలోల గంజాయి, 23.68 కిలోల హషీష్ ఆయిల్ బహిరంగ ధ్వంసం.

క్రైమ్9మీడియా జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

విశాఖపట్నం, జూన్ :18 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మాదకద్రవ్యాల రహిత రాష్ట్రం’ నిర్మాణంలో భాగంగా విశాఖపట్నం రేంజ్ పోలీస్ శాఖ చారిత్రాత్మక విజయాలను నమోదు చేస్తోంది. గంజాయి సాగు, అక్రమ రవాణా, మరియు వినియోగాన్ని పూర్తిగా అరికట్టడమే ధ్యేయంగా చట్టపరమైన నిర్బంధాలు, కఠిన చర్యలతో పాటు సామాజిక అవగాహన, ప్రత్యామ్నాయ జీవనోపాధి కార్యక్రమాలతో కూడిన సమగ్ర కార్యాచరణను పోలీసులు విజయవంతంగా అమలు చేస్తున్నారు.ఈ సందర్బంగాహోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ 

​"రాష్ట్రంలో మాదకద్రవ్యాల రహిత సమాజాన్ని స్థాపించడమే మా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతూనే, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించి రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాము. యువతను డ్రగ్స్ బారిన పడకుండా రక్షించేందుకు విద్యాసంస్థల్లో పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాము. గంజాయి నెట్‌వర్క్‌లను సమూలంగా ధ్వంసం చేయడానికి అంతరాష్ట్ర, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసుకుంటూ, నిందితుల ఆస్తులను సైతం అటాచ్ చేస్తున్నాం. పోలీసుల పటిష్టమైన నిఘా, అంకితభావం వల్లే నేడు విశాఖ రేంజ్ 'జీరో కల్టివేషన్' దిశగా చారిత్రాత్మక అడుగులు వేసింది."

*విశాఖపట్నం రేంజ్ ఐజీపీ గోపీనాథ్ జట్టి,మాట్లాడుతూ:* 

​"జులై 2024లో మేము నిర్దేశించుకున్న 'Zero Cultivation' (సున్నా సాగు) చారిత్రాత్మక లక్ష్యాన్ని జనవరి 2026 నాటికి నూటికి నూరు శాతం సాధించగలిగాము. 2021–22లో అల్లూరి సీతారామరాజు (ASR) జిల్లాలో 7,515.15 ఎకరాలుగా ఉన్న గంజాయి సాగు విస్తీర్ణాన్ని, నిరంతర నిఘా, డ్రోన్ల వినియోగం, ప్రత్యామ్నాయ పంటల పంపిణీ ద్వారా 0 ఎకరాలకు (Zero Cultivation) తీసుకువచ్చాం. కేవలం చట్టాల అమలు మాత్రమే కాకుండా గిరిజన యువతకు ఉపాధి కల్పన, కౌన్సిలింగ్, మరియు విస్తృత సామాజిక చైతన్యం ద్వారా ఈ విజయం సాధ్యమైంది."

*గణనీయమైన ఫలితాలు – కీలక గణాంకాలు* (జూలై-2024 నుండి ఇప్పటివరకు):

*కేసులు & అరెస్టులు:* రేంజ్ పరిధిలో మొత్తం 1,142 NDPS కేసులు నమోదు చేసి, 3,377 మంది నిందితులను అరెస్టు చేయడం జరిగింది.

​స్వాధీనం చేసుకున్న ముఠా సొత్తు: 65,560 కిలోల గంజాయి, 83.19 కిలోల హషీష్ ఆయిల్ స్వాధీనం చేసుకొని, రవాణాకు ఉపయోగించిన 832 వాహనాలను సీజ్ చేశారు.

*ఆర్థిక దర్యాప్తు & ఆస్తుల ఫ్రీజ్:* నేరగాళ్ల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ 19 కేసుల్లో 18 మంది నిందితులకు చెందిన రూ.11.02 కోట్ల విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేశారు.

*కఠిన నిర్బంధ చర్యలు (PIT-NDPS):* పునరావృత నేరస్థులపై కఠిన చర్యల్లో భాగంగా 132 మందిపై ప్రతిపాదనలు పంపగా, 51 మందిని ఇప్పటికే నిర్బంధించారు. అలాగే 1,942 హిస్టరీ షీట్లు తెరిచారు.

​పరారీలో ఉన్న నేరస్థుల పట్టివేత: 64 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరారీలో ఉన్న 497 మంది నిందితులను, 419 మంది నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) నిందితులను అరెస్ట్ చేశారు.

*అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ముఠాల ఛేదనం:* ​అనకాపల్లి జిల్లా (పరవాడ పి.ఎస్): జిల్లా ఎస్పీ శ్రీ తూహిన్ సిన్హా, ఆధ్వర్యంలో శ్రీలంక డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్న అంతర్జాతీయ ముఠాను ఛేదించి, రూ.1.07 కోట్ల విలువైన 213.360 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

​అల్లూరి సీతారామరాజు జిల్లా (అన్నవరం పి.ఎస్): జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర ముఠాను చాకచక్యంగా ఛేదించి, రూ.1.04 కోట్ల విలువైన 209.04 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

*పునరావాసం మరియు ప్రత్యామ్నాయ జీవనోపాధి:* 

*ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం:* 2025-26లో 1.59 కోట్ల మొక్కలు, 37,678 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేసి, 29,840 ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగును విజయవంతంగా ప్రోత్సహించారు.

*గిరిజన యువతకు ఉపాధి:* గంజాయి రవాణాకు దూరంగా ఉంచేందుకు నైపుణ్యాభివృద్ధి ద్వారా 415 మందికి ఉపాధి కల్పించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మారిటైమ్ అండ్ షిప్‌బిల్డింగ్ (CEMS) ద్వారా 360 మంది యువకులకు ప్రత్యేక శిక్షణ, 80 మంది గిరిజన మహిళలకు టైలరింగ్‌లో స్వయం ఉపాధి శిక్షణ అందించారు.

*​డీ-అడిక్షన్ కేంద్రాలు:* మాదకద్రవ్యాలకు బానిసలైన 258 మందిని డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

*సాంకేతికత – అంతర్రాష్ట్ర సమన్వయం – శిక్షణ:* 

*సాంకేతిక పరిజ్ఞానం:* KHOJ, NIDAAN, NATGRID మరియు ICJS డేటాబేస్‌ల ద్వారా 173 మంది అంతర్రాష్ట్ర నిందితులను గుర్తించారు. డ్రోన్ల ద్వారా 144 హాట్‌స్పాట్లను గుర్తించి 144 మందిని అరెస్ట్ చేశారు.

*చెక్ పోస్టులు:* రేంజ్ పరిధిలోని 28 స్టాటిక్, 480 డైనమిక్ చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు చేస్తూ 62,446 కిలోల గంజాయి, 69.29 కిలోల హషీష్ ఆయిల్ సీజ్ చేశారు.

*అధికారులకు శిక్షణ:* దర్యాప్తు నాణ్యత పెంచేందుకు DSNLU, NACIN సంస్థల సహకారంతో 182 మంది అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కోర్టుల్లో సమర్థవంతంగా వాదించి 80 కేసుల్లో 143 మంది నిందితులకు శిక్షలు పడేలా చేసిన అధికారులను రివార్డులతో సత్కరించారు.

*ప్రజా ఉద్యమంగా సామాజిక అవగాహన కార్యక్రమాలు:* 

*సంకల్పం:* 22,050 అవగాహన కార్యక్రమాల ద్వారా 12.72 లక్షల మంది ప్రజలను, 6,575 విద్యాసంస్థల్లో 5.39 లక్షల మంది విద్యార్థులను చైతన్యపరిచారు. 4,094 ఈగల్ క్లబ్‌లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా 150 గ్రామాలకు చెందిన సుమారు 30,000 మంది రైతులు స్వచ్ఛందంగా గంజాయి సాగును బహిష్కరించారు.

53 రోజుల పాటు 1,300 కిలోమీటర్లు ప్రయాణించి 2,500 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

సంకల్పం 2.0, అభ్యుదయం 2.0, చైతన్యం 2.0 ద్వారా విశాఖ రేంజ్ పరిధిలో ఇప్పటివరకు 234 గ్రామాలను 'డ్రగ్-ఫ్రీ' (మాదకద్రవ్యాలు లేని) గ్రామాలుగా ప్రకటించారు.

 ​గత ఏడాది కాలంలో భారీ ఎత్తున గంజాయిని ధ్వంసం చేసిన పోలీసులు, నేడు (తేదీ 18-06-2026) అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, మరియు శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 490 కేసులలో స్వాధీనం చేసుకున్న 20,876 కిలోల గంజాయిని, 23.68 కిలోల హషీష్ ఆయిల్‌ను చట్టప్రకారం పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు.

 గతంలో నిర్వహించిన గంజాయి ధ్వంసం కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, విశాఖపట్నం రేంజ్ పోలీసులు మాదకద్రవ్యాల నిర్మూలనలో వరుసగా భారీ విజయాలను సాధిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా:

​జనవరి 2025: 2025 జనవరి 28, 29 తేదీల్లో అనకాపల్లి జిల్లాకు చెందిన 459 కేసులలో స్వాధీనం చేసుకున్న 34,818 కిలోల గంజాయిని, 39.04 కిలోల హషీష్ ఆయిల్‌ను ధ్వంసం చేశారు.

​ఫిబ్రవరి 2025: అదే ఏడాది ఫిబ్రవరి 21, 22 తేదీల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన 255 కేసులలోని 30,005 కిలోల గంజాయిని, 35.35 కిలోల హషీష్ ఆయిల్‌ను విజయవంతంగా నిర్మూలించారు.

​మార్చి 2025: తదుపరి చర్యగా మార్చి 20 తేదీన విజయనగరం, పార్వతీపురం మన్యం, మరియు శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 226 కేసులకు సంబంధించి 8,027 కిలోల గంజాయిని బహిరంగంగా ధ్వంసం చేయడం జరిగింది.

​ఫిబ్రవరి 2026: నిఘాను మరింత తీవ్రం చేస్తూ, 2026 ఫిబ్రవరి 25న అల్లూరి సీతారామరాజు మరియు అనకాపల్లి జిల్లాలకు చెందిన రికార్డు స్థాయి 783 కేసులలో పట్టుబడిన 52,336 కిలోల గంజాయిని, 142.45 కిలోల హషీష్ ఆయిల్‌ను ఒకేసారి ధ్వంసం చేశారు.

ఈ నిరంతర ప్రక్రియలో భాగంగానే, నేడు (18-06-2026) రేంజ్ పరిధిలోని అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, మరియు శ్రీకాకుళం జిల్లాల వ్యాప్తంగా ఉన్న 490 కేసులకు సంబంధించిన 20,876 కిలోల గంజాయిని, 23.68 కిలోల హషీష్ ఆయిల్‌ను చట్టప్రకారం పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు.

మాదకద్రవ్యాల రహిత సమాజ స్థాపనే ధ్యేయంగా చట్ట అమలు, ప్రజా చైతన్యం, ప్రత్యామ్నాయ జీవనోపాధి కార్యక్రమాలను సమన్వయం చేస్తూ విశాఖపట్నం రేంజ్ పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలతో 

ముందుకు సాగుతారు. 

ఈ బృహత్తర కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, అనకాపల్లి జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా, విజయనగరం జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఐపీఎస్, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, మరియు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర్ రెడ్డి లతో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post