వీధికుక్కల దాడులతో ప్రజలు భయాందోళన.



 వీధికుక్కల దాడులతో ప్రజలు భయాందోళన.

10 ఏళ్ల బాలుడిపై దాడి.. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన 

పలాస, జూన్ 25: శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో వీధికుక్కల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. పట్టణంలోని పలు కాలనీల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తున్న వీధికుక్కలు చిన్నారులు, మహిళలు, వృద్ధులపై దాడులకు పాల్పడుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

తాజాగా శ్రీనివాసనగర్ ప్రాంతంలో 10 ఏళ్ల బాలుడిపై వీధికుక్కల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘటనలో బాలుడికి శరీరంలోని పలు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. బాలుడి అరుపులు విన్న స్థానికులు వెంటనే స్పందించి కుక్కలను తరిమికొట్టి, క్షతగాత్రుడిని హుటాహుటిన పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

స్థానికుల కథనం ప్రకారం, పట్టణంలో వీధికుక్కల సంఖ్య గణనీయంగా పెరిగిపోయిందని, ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రహదారులపై నడవాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగాలకు వెళ్లే ప్రజలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు.

వీధికుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వీధికుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, వాటిని పట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రజలకు రక్షణ కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని ప్రమాదాలు చోటుచేసుకునేలోపే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post