అంతర్జాతీయ యోగ దినోత్సవం పురస్కరించుకొని యోగ నిర్వహించిన జాయింట్ కలెక్టర్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఒంగోలు నూతన శక్తికి నిత్య యోగా సాధన ఉత్తమ మార్గమని జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో జరుగుతున్న యోగా సాధనలో భాగంగా శుక్రవారం ఒంగోలు నగరంలోని గాంధీ పార్కులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్.నూకసాని బాలాజీ, పిడిసిసి బ్యాంకు చైర్మన్ కామేపల్లి సీతారామయ్యలతో కలిసి ఆమె పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వయం సహాయక సంఘాల సభ్యులతో నిర్వహించిన ఈ యోగా సాధనలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని ఆసనాలు వేశారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరి ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం 'యోగాంధ్ర' కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు స్పష్టం చేశారు. యోగా సాధన ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయన్నారు. నిత్యం యోగా సాధన చేయటం ద్వారా నూతన శక్తిని, ఉత్సాహాన్ని పొందవచ్చు అన్నారు.
నూకసాని బాలాజీ మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవన విధానంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
సీతారామయ్య మాట్లాడుతూ జీవనశైలిని మార్చుకోవటం ద్వారా దీర్ఘాయువును, ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చన్నారు. దీనికి యోగా సాధన అత్యుత్తమమని చెప్పారు.
పతంజలి యోగా సంస్థ నిపుణుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి తేళ్ల రవికుమార్, యోగాంధ్ర నోడల్ ఆఫీసర్ డాక్టర్ భీమ్ నాథ్, జిల్లా స్థాయి అధికారులు, ఆర్డిఓ చంద్రశేఖర్ నాయుడు, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణయ్య, ఏఎంసీ చైర్మన్ ఆర్.వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.
రెడ్ క్రాస్ ప్రాంగణంలో నిత్య సాధన
పతంజలి సంస్థ యోగా గురువు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ ఈనెల 22 తేదీ నుంచి ఒంగోలు నగరంలోని రెడ్ క్రాస్ కార్యాలయ ప్రాంగణంలో ప్రతి రోజూ యోగా శిక్షణా కార్యక్రమాలు ఉంటాయన్నారు. ప్రజల ఆసక్తి మేరకు ఈ కార్యక్రమాలను ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తామన్నారు.



