గొల్లవూరులో విషాదం.. ఇద్దరు చిన్నారులకు తల్లిదండ్రుల దూరం.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
సోంపేట, జూన్ 18:
సోంపేట మండలం గొల్లవూరు గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పిన్నింటి ఊర్వశి (38) గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న బారువ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బారువ ఎస్సై హరిబాబు నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం స్పష్టమయ్యే అవకాశముందని పోలీసులు తెలిపారు.
కాగా, ఊర్వశి భర్త పిన్నింటి రాజారావు ఈ ఏడాది మార్చి 13న మృతి చెందిన విషయం తెలిసిందే. భర్త మరణించిన మూడు నెలలు కూడా గడవకముందే ఊర్వశి మృతి చెందడంతో వారి ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయారు.
తల్లిదండ్రుల ప్రేమాభిమానాలకు దూరమైన చిన్నారుల పరిస్థితి గ్రామస్తులను కలచివేస్తోంది. చిన్నారుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తుండగా, పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.

