ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి – పలాస ఆర్టీసీ డిపో వద్ద ధర్నా.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
పలాస, జూన్ 3: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించడంతో పాటు కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పలాస ఆర్టీసీ డిపో వద్ద ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు బుధవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు, ఉద్యోగులు డిపో ఎదుట యూనియన్ జెండాలతో నినాదాలు చేస్తూ తమ సమస్యల పరిష్కారం కోరారు. అనంతరం యూనియన్ కార్యదర్శి ఏ. దిలీప్ కుమార్ మాట్లాడుతూ, 2019కు ముందు ఉద్యోగులపై సస్పెన్షన్లు, ఛార్జ్ షీట్లు వంటి చర్యలు ఎక్కువగా ఉండేవని తెలిపారు. అనంతరం రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, అప్పటి ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు చొరవతో ఉద్యోగుల భద్రత కోసం జాబ్ సెక్యూరిటీ కార్డును అమలు చేశారని గుర్తు చేశారు.
అయితే సురేంద్రబాబు పదవీ విరమణ అనంతరం ఆ విధానాన్ని పక్కన పెట్టడంతో ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే డిపోలో కాలం చెల్లిన బస్సులు నడుస్తుండటంతో ప్రయాణికులతో పాటు ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించాలంటే వెంటనే కొత్త బస్సులను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఎం.ఏ. రాజుతో పాటు యూనియన్ నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

