రామకృష్ణాపురంలో పోలీసుల అవగాహన కార్యక్రమం.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
పలాస, జూన్ 3:
ప్రజల భద్రత, మహిళా సాధికారత, సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించేందుకు కాశీబుగ్గ పోలీసులు రామకృష్ణాపురం గ్రామంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మంగళవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఎస్సై ఆర్. నరసింహమూర్తి తన సిబ్బందితో కలిసి పలాస మండలంలోని రామకృష్ణాపురం గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు నారీశక్తి, మహిళల హక్కులు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలు శాంతియుత వాతావరణాన్ని కొనసాగించాలని, ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని సూచించారు.
అలాగే గ్రామంలోని దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, గ్రామంలో పండుగలు, ఉత్సవాలు లేదా ఇతర సామూహిక కార్యక్రమాలు నిర్వహించే ముందు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. దీంతో భద్రతా చర్యలు మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.
సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ చెల్లింపుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బెట్టింగ్ యాప్‌ల ప్రమాదాలు, పేకాట, గంజాయి, నాటు సారా అక్రమ రవాణా మరియు విక్రయాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అదేవిధంగా బాల్య వివాహాల నివారణ, మహిళలు మరియు బాలికలపై జరిగే నేరాల నిరోధం, అత్యవసర పరిస్థితుల్లో 112 సేవల వినియోగం, మహిళల రక్షణకు అందుబాటులో ఉన్న పోలీసు సేవల గురించి వివరించారు. గ్రామ ప్రజలు పోలీసులకు సహకరించి నేర రహిత సమాజ నిర్మాణానికి తోడ్పడాలని ఎస్సై నరసింహమూర్తి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
