రెండేళ్లలో సంక్షేమం – అభివృద్ధి సమన్వయంతో ముందుకెళ్లిన కూటమి ప్రభుత్వం.
పలాస నియోజకవర్గ అభివృద్ధికి రూ.930 కోట్ల పనులు చేపట్టాం: ఎమ్మెల్యే గౌతు శిరీష.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
పలాస, జూన్ 4:
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పలాస తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పలాస నియోజకవర్గంలో జరుగుతున్న పనులపై ఆమె వివరాలు వెల్లడించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీల అమలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. రైతుల కోసం "అన్నదాత సుఖీభవ" పథకం అమలు చేస్తున్నామని, వృద్ధులు, వికలాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు పెంచిన పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. "తల్లికి వందనం" పథకం ద్వారా విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక చేయూత అందిస్తుండగా, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీతో గృహిణులకు ఉపశమనం కల్పిస్తున్నామని చెప్పారు.
మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, "స్త్రీ శక్తి" పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. అలాగే "పల్లె పండుగ" కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు.
పలాస నియోజకవర్గంలో సుమారు రూ.930 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆమె వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కాశీబుగ్గ రైల్వే వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అదేవిధంగా ఆఫ్‌షోర్ జలాశయ నిర్మాణాన్ని పూర్తిచేసి సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
అమృత్ భారత్ పథకం కింద రూ.60 కోట్లతో పలాస రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా వందలాది మంది ఉద్యోగాలు పొందారని పేర్కొన్నారు.
పలాస ప్రాంత జీడి పరిశ్రమ అభివృద్ధి కోసం జీడి బోర్డు ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టామని, అవసరమైన స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొని ఉందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
