రెవెన్యూ సమస్యలు గ్రామస్థాయిలోనే పరిష్కరించాలి కలెక్టర్.


రెవెన్యూ సమస్యలు గ్రామస్థాయిలోనే పరిష్కరించాలి కలెక్టర్.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లాలో ప్రజల రెవెన్యూ సమస్యలను గ్రామ స్థాయిలోనే వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఒక నెల ఒక గ్రామం పరిశీలన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. 

ఈ కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా ప్రతి మండలంలో ప్రతి నెల ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, ఆ గ్రామంలో వరుసగా నాలుగు వారాల పాటు నాలుగు విడతలుగా ప్రత్యేక రెవెన్యూ గ్రామ సందర్శనలు నిర్వహించబడతాయి. 

గ్రామస్థుల భూ, రెవెన్యూ సంబంధిత సమస్యలను గ్రామంలోనే స్వీకరించి, పరిశీలించి, చట్టబద్ధంగా పరిష్కరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని కలెక్టర్ పేర్కొన్నారు.

ప్రత్యేకంగా రీ-సర్వే గ్రామాలు, ఎక్కువ సంఖ్యలో పెండింగ్ రెవెన్యూ ఫిర్యాదులు ఉన్న గ్రామాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో, మండల సర్వేయర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ తదితర అధికారులు తప్పనిసరిగా పాల్గొంటారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో భాగంగా:

మొదటి సందర్శనలో ఫిర్యాదుల స్వీకరణ, గ్రామ భూ రికార్డుల పరిశీలన,

 రెండవ సందర్శనలో ఫీల్డ్ వెరిఫికేషన్ మరియు విచారణ,

మూడవ సందర్శనలో సమస్యల పరిష్కారం మరియు ఉత్తర్వుల జారీ,

నాల్గవ సందర్శనలో గ్రామ సభ నిర్వహించి పరిష్కరించిన సమస్యల వివరాల ప్రజాప్రకటన చేపడతారని తెలిపారు.

భూ సరిహద్దు వివాదాలు, మార్పిడి (మ్యుటేషన్ ) సమస్యలు, కుటుంబ భూ వివాదాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, రీ-సర్వే సమస్యలు, 22-A నిషేధిత ఆస్తుల అంశాలు, దారుల వివాదాలు తదితర రెవెన్యూ సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలను “రెవెన్యూ ఫిర్యాదుల రహిత గ్రామాలుగా” తీర్చిదిద్దడం, ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడం, పెండింగ్ ఫిర్యాదులను తగ్గించడం మరియు ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

జిల్లాలోని ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ రెవెన్యూ సమస్యలను సంబంధిత గ్రామ సందర్శనల సమయంలో అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. 

ఈ కార్యక్రమం రేపటి నుంచి (గురువారం ) మార్కాపురం జిల్లాలో మొదవుతుంది. ప్రతి మండలానికి ఒక గ్రామం చొప్పున ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post