అటవీశాఖ అధికారులకు లభ్యమైన బృహత్ శిలా యుగం నాటి మట్టి పాత్రలు - పురావస్తు శాఖ.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం బిజినేపల్లి కుంట అటవీ ప్రాంతాల్లో ఇటీవల అటవీశాఖ అధికారులకు లభ్యమైన మట్టి పాత్రలను పరిశీలించగా అవి బృహత్ శిలా యుగం నాటి మట్టి పాత్రలు అని, వాటిని ఆనాటి ప్రజలు మరణానంతర కార్యక్రమాల్లో శిష్టబలి ఉపయోగించేవారని భావిస్తున్నట్లు విజయవాడ పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటరావు తెలిపారు.
గురువారం కంభం పోలీసు సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల సోషల్ మీడియా, మీడియా లో అటవీశాఖ అధికారులకు మట్టి పాత్రలు లభ్యమయ్యాయి అన్న సమాచారం మేరకు తాము అర్ధవీడుమండలం బిజినేపల్లి ప్రాంతంలో లభ్యమైన మట్టి పాత్రలను పరిశీలించగా అవి బృహత్ శిలాయుగం మరియు ప్రాచీన శిలాయుగం కాలం నాటి ఆనవాళ్లను కనబరుస్తున్నట్లు గుర్తించామన్నారు. లభ్యమైన మట్టి పాత్రలు, ప్రాచీన శిలాయుగపు పనిముట్లు సుమారు 2,500 సంవత్సరాల క్రితం నాటివిగా అంచనా వేస్తున్నామని, లభించిన మట్టి పాత్రలను బట్టి, ఆనాటి ప్రజలు మరణానంతర కార్యక్రమాల్లో శిష్టబలికి ఉపయోగించేవాటిగా భావిస్తున్నామన్నారు.
అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో మరిన్ని ఆధారాల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నామని తెలిపారు. లభించిన పనిముట్లు దాదాపు 10 వేల నుంచి లక్ష సంవత్సరాల క్రితం నాటివని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు.
ఈ ప్రాంతం పురాతన ఆధారాలకు నిలయంగా ఉన్నందున, స్థానికంగా ఏదైనా తవ్వకాలు జరిపినప్పుడు లేదా అనుమానాస్పద పురావస్తు ఆనవాళ్లు కనిపిస్తే, వెంటనే రెవెన్యూ లేదా పురావస్తు శాఖకు సమాచారం అందించాలని అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటరావు ప్రజలను కోరారు.
సమాచారం అందిన వెంటనే తమ బృందం స్పందించి, శాస్త్రీయంగా పరిశీలించి చర్యలు తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పి నాగరాజు, కంభం సీఐ కొమర మల్లిఖార్జున, నెల్లూరు అసిస్టెంట్ డైరెక్టర్ జరీనా బేగం తదితరులు పాల్గొన్నారు.
