మహిళలు.. చిన్నారుల భద్రతకు కట్టుదిట్టమైన కవచం ఒంగోలు వన్ టౌన్ సీఐ ఆధ్వర్యంలో గాంధీ పార్క్‌లో అవగాహన సదస్సు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలు వన్ టౌన్ సీఐ ఆధ్వర్యంలో గాంధీ పార్క్‌లో విస్తృత స్థాయిలో అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు.
ఒంగోలు వన్ టౌన్ సీఐ మాట్లాడుతూ మహిళలు చిన్నారుల రక్షణతో పాటు సమాజంలో పెరుగుతున్న సామాజిక నేరాలను నిర్మూలించడమే లక్ష్యంగా మహిళా పోలీసు సిబ్బంది సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు భద్రతా చైతన్యం కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న నేరాలు, చిన్నారుల రక్షణకు సంబంధించిన చట్టాలు, ముఖ్యంగా ఫోక్సో యాక్ట్ గురించి వివరంగా అవగాహన కల్పించారు. పిల్లలపై దాడులు, వేధింపులు వంటి సంఘటనలను తక్షణమే పోలీసులకు తెలియజేయాల్సిన అవసరాన్ని స్పష్టంగా తెలియజేశారు.
అదేవిధంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు, బెట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాల ప్రభావం, సైబర్ నేరాల పెరుగుతున్న ముప్పు మరియు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు మార్గదర్శకాలు అందించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మంచి అలవాట్లు అలవరచుకోవాలని సూచించారు.
మహిళల భద్రత కోసం అందుబాటులో ఉన్న శక్తి యాప్ వినియోగంపై ప్రత్యేకంగా వివరించి, అత్యవసర పరిస్థితుల్లో యాప్ ద్వారా వెంటనే పోలీసులను సంప్రదించవచ్చని తెలియజేశారు.
రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తమ బాధ్యతగా భావించాలన్నారు. విద్య ప్రాముఖ్యతను వివరించి, తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
ఈ అవగాహన సదస్సు ద్వారా సమాజంలో చైతన్యం పెంపొందించి, నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడమే ముఖ్య ఉద్దేశమని పోలీసులు తెలిపారు. సమాజం మొత్తం కలిసి పనిచేస్తేనే మహిళలు, పిల్లలు సురక్షితంగా ఉండగలరని పేర్కొన్నారు.

