మహానాడులో జగన్ నామస్మరణ తప్ప రాష్ట్ర అభివృద్ధిపై తీర్మానాలేవీ లేవు.
ప్రజా డబ్బుతో ఆర్భాటం చేశారు.. కానీ ప్రజా సమస్యలపై చర్చించలేదు.
వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి బమ్మిడి దుర్యోధనరావు విమర్శలు.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
పలాస, మే 30:
రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించిన టీడీపీ మహానాడులో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ఉద్యోగాల కల్పన వంటి కీలక అంశాలపై ఒక్క తీర్మానం కూడా చేయలేదని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి బమ్మిడి దుర్యోధనరావు విమర్శించారు. శనివారం పలాసలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మహానాడు రాష్ట్ర భవిష్యత్తుపై చర్చించే వేదికగా ఉండాల్సిందని, అయితే ఈసారి మహానాడులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరును ప్రస్తావించడం మినహా ప్రజా సమస్యలపై ఎలాంటి చర్చ జరగలేదని ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, కౌలు రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ ఛార్జీల పెంపు, ఆరోగ్యశ్రీ బకాయిలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వంటి సమస్యలను పూర్తిగా విస్మరించారని అన్నారు.
ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, రైతు భరోసా, ఉచిత బస్సు ప్రయాణం, కొత్త పింఛన్ల వంటి హామీలు అమలు కాలేదని విమర్శించారు.
రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని, అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టుల విషయంలో కూడా ఆశించిన పురోగతి కనిపించడం లేదని పేర్కొన్నారు. "వెల్త్ క్రియేషన్" పేరుతో ఎవరికి సంపద సృష్టించారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధిపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించకుండా వ్యక్తిగత విమర్శలకే మహానాడును పరిమితం చేశారని దుర్యోధనరావు ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా రాజకీయ విమర్శలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం బాధాకరమని అన్నారు.
ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
