ఉపాధ్యాయుడిగా విద్యాబోధన... కళాకారుడిగా విశిష్ట గుర్తింపు.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు... ప్రవృత్తిరీత్యా కళాకారుడు... ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్నప్పటికీ, తెలుగు సాహిత్యం మరియు పౌరాణిక నాటకాలపై అపారమైన ఆసక్తితో కళారంగంలో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి కణితి సూర్యనారాయణ మాస్టారు.
శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన సూర్యనారాయణ మాస్టారు చిన్ననాటి నుంచే పౌరాణిక పద్యాలపై మక్కువ పెంచుకుని, పలువురు గురువుల వద్ద శిక్షణ పొంది పద్యాలను అలవోకగా ఆలపించే నైపుణ్యాన్ని సంపాదించారు. సత్యహరిశ్చంద్ర, గయోపాఖ్యానం, శ్రీరామాంజనేయ యుద్ధం, లవకుశ వంటి ప్రసిద్ధ పౌరాణిక నాటకాలలో స్త్రీ పాత్రలతో పాటు అనేక విభిన్న పాత్రలను పోషించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు పొరుగు ఒడిశా రాష్ట్రంలోనూ వందలాది పౌరాణిక నాటక ప్రదర్శనల్లో పాల్గొని తన నటనా ప్రతిభను చాటుకున్నారు. కళారంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు సైతం వరించాయి. ఉపాధ్యాయ వృత్తిని నిర్వర్తిస్తూ కళా సేవను కొనసాగించడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది.
నేటికీ పౌరాణిక నాటకాల ప్రదర్శనల్లో చురుకుగా పాల్గొంటూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న సూర్యనారాయణ మాస్టారుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది జూన్ నెలలో రాజమండ్రిలో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు చైతన్య సారస్వత పరిషత్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ, తెలుగు భాషా సాహిత్యాల పరిరక్షణకు తనవంతు కృషి కొనసాగిస్తానని తెలిపారు.
ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు జ్ఞానాన్ని పంచుతూ... కళాకారుడిగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న కణితి సూర్యనారాయణ మాస్టారు నిజంగా అభినందనీయులు.

