ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం : ప్రజా దర్బార్‌ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల.


 ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం : ప్రజా దర్బార్‌ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం శనివారం నియోజకవర్గంలోని గ్రామాల నుండి వచ్చిన ప్రజలతో కోలాహలంగా మారింది. నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను, సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారు "ప్రజా దర్బార్"కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రజల నుండి స్వయంగా అర్జీలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

ఉదయం నుంచే నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, పట్టణ పరిధిలోని వార్డుల నుండి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యేకు అర్జీలు అందచేసి విన్నవించుకున్నారు. 

ప్రతి ఒక్క అర్జీదారునితో మాట్లాడి సమస్యను శాంతంగా వింటూ, అర్జీలను స్వీకరించారు.

గిద్దలూరు పట్టణం 2వ వార్డుకు చెందిన మహిళలు తమ వార్డులోని నరసింహ స్వామి మెట్లు, జీవన్ టైలర్స్ కాలనీల్లో పైప్ లైన్ వేసి త్రాగునీటి సమస్య తీర్చమని విన్నవించారు. 17 వ వార్డులో సగిలేరు సప్లై ఛానల్ వద్ద పడిపోయిన బ్రిడ్జిని పునః నిర్మించాలని, మరియు 60 మీటర్లు సీసీ రోడ్డు వేయాలని స్థానికులు విన్నవించగా వెంటనే గిద్దలూరు కమిషనర్ కు ఫోన్ చేసి సమస్యలను పరిష్కారం చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అదే విధంగా పట్టణంలోని అర్బన్ కాలనీలోని సబ్ స్టేషన్ ఫీడర్ పై, హెవీ లోడ్ పడటంతో స్థానికంగా విద్యుత్ సమస్య తరచూ నెలకొంటుందని తెలిపారు.

రాచర్ల మండలం, ఆకవీడు గ్రామంలోని ఎస్సి పాలెంలో విద్యుత్ స్థంబాలు అవసరమని ఎమ్మెల్యేకు తెలుపగా సంబంధిత విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి వెంటనే సమస్యలను పరిష్కారం చేయాలన్నారు. కంభం పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలో సీసీ రోడ్డు నిర్మించాలని, మరియు రావిపాడు గ్రామంలో పంట కాలువల తూములను మరమ్మత్తులు చేయించాలని విన్నవించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరతగతిన పరిష్కారం చేయాలని ఆదేశాలిచ్చారు.

ప్రజా దర్బార్ లో పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, విద్యుత్, తాగునీరు మరియు డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కల్పనతో పాటు వ్యక్తిగత సమస్యల పై ప్రజలు ఎమ్మెల్యేకు అర్జీలు సమర్పించారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో మొత్తం 49 మంది అర్జీదారులు పాల్గొన్నారు.. 

ఈ సందర్భంగా శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారం లభించాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ప్రజా దర్బార్‌కు వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. కొన్ని తక్షణ సమస్యల పై సంబంధిత శాఖల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, అక్కడికక్కడే పరిష్కార మార్గాలను చూపడం జరిగిందని, మిగిలిన సమస్యలను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించేలా అధికారులను ఆదేశించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post