బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.
శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దు - జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి ఏప్రిల్ :10 అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా శుక్రవారం బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి, స్టేషన్ పనితీరును మరియు కేసుల ప్రగతిని క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీకి అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.శ్రావణి, కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు, మరియు ఎస్సై ఏ.శ్రీనివాసరావు సాదర స్వాగతం పలికారు.
తనిఖీలో భాగంగా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ.ఆస్తి దొంగతనాలు జరగకుండా పక్కా ప్రణాళికతో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. ముఖ్యంగా రాత్రి మరియు పగలు సమయాల్లో బీట్లను మరింత పటిష్టం చేయాలని, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. రౌడీ షీటర్లను ప్రతి వారం పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేయాలన్నారు.
సమాజంలో చైతన్యం తేవడానికి రోడ్డు భద్రత, సైబర్ క్రైమ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు, మహిళలకు మరియు బాలబాలికలకు వారి రక్షణకు సంబంధించిన చట్టాలపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
పోలీసు అధికారులు తరచుగా గ్రామాలను సందర్శించాలని, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. వారు అందించే సమాచారంపై తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై గ్రామస్థులను ప్రోత్సహించాలని, స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులను, సీజ్ చేసిన వాహనాలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
అనంతరం స్టేషన్ సిబ్బందితో సమావేశమైన ఎస్పీ విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధత కలిగి ఉండాలని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవయే పరమావధిగా పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో ఎస్సై ఏ.శ్రీనివాసరావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

