ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పోరేషన్ పరిధిలో డోర్ టు డోర్ చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించడంతో పాటు డ్రైనేజ్ క్లీనింగ్ ప్రక్రియ పటిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
శనివారం ఉదయం జిల్లా కలెక్టర్,పి రాజాబాబు, ఒంగోలు కార్పోరేషన్ పరిధిలోని బొల్లినేనిపాలెం, కమ్మపాలెం తదితర ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించి పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు.
ముందుగా జిల్లా కలెక్టర్ కమ్మపాలెం పరిధిలోని బొల్లినేనిపాలెం ను సందర్శించి పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆ ప్రాంత ప్రజలతో మాట్లాడుతూ వారానికి ఎన్ని రోజులు ఇంటింటి చెత్త సేకరణ జరుగుచున్నది,
చెత్త సేకరణకు శానిటేషన్ సిబ్బంది వస్తున్నారా లేదా, తడి చెత్త, పొడి చెత్త వేరుచేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పారిశుధ్య నిర్వహణ పై జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఒంగోలు నగరంలో పారిశుధ్య నిర్వహణ కచ్చితంగా జరగాలని, నిర్లక్ష్యంగా విధులు నిర్వహించిన శానిటేషన్ సిబ్బంది పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు.
ముఖ్యంగా సైడు కాలువలలో పడినచెత్తను ఎప్పటికప్పుడు తీసేలా మురుగు నీరు నిల్వకుండా అవసరమైన చర్యలుచేపట్టాలన్నారు.
ఈ సందర్భంగా ఒక కార్యక్రమం నిర్వహణకు సంబంధించి వాడిన ప్లాస్టిక్ గ్లాసులు సైడుకాలువలో పడి ఉండటం గమనించిన జిల్లా కలెక్టర్ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, సంబంధిత వారిపై పెనాల్టీ విధించాల్సిందిగా మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అలాగే సిసి కెమెరాలను ముఖ్య కూడళ్ళలో ఏర్పాటుచేసి పారిశుధ్య నిర్వహణ పై పర్యవేక్షణ చేపట్టాలన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కార్పోరేషన్ పరిధిలోని చెరువుకొమ్ముపాలెంను సందర్శించి పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. డోర్ టు డోర్ చెత్త సేకరణ సక్రంగా నిర్వహించడంతో పాటు పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అలాగే డ్రైనేజ్ క్లీనింగ్ ప్రక్రియ పటిష్టంగా నిర్వహించాలని పంచాయతీ సెక్రటరి ని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్, సౌత్ బైపాస్ జంక్షన్ ను , రిమ్స్ వద్ద మెయిన్ రహదారి ప్రాంతాన్ని సందర్శించి పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. ప్రతి రోజు క్షేత్ర స్థాయిలో పర్యటించి పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్, శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ వెంట ఒంగోలు మున్సిపల్ కమీషనర్, వెంకటేశ్వర రావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వైష్ణవి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
