పల్లె నిద్ర కార్యక్రమంలో ప్రజలతో ముఖాముఖి ప్రకాశం కలెక్టర్.




 పల్లె నిద్ర కార్యక్రమంలో ప్రజలతో ముఖాముఖి ప్రకాశం కలెక్టర్. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం గ్రామస్థాయిలో ప్రజలతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకే ' పల్లెనిద్ర ' కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ .పి.రాజాబాబు చెప్పారు. శుక్రవారం ఆయన చీమకుర్తి మండలంలోని చండ్రపాడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే బి.ఎన్.విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారిలతో కలిసి గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు ప్రస్తావించిన సమస్యలను ఓపికతో విని వాటి పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. గ్రామ అభివృద్ధిలో,  ప్రత్యేకంగా పారిశుధ్య నిర్వహణలో ప్రజలు కూడా తమ వంతు బాధ్యత నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. బహిరంగ మలవిసర్జన సరికాదన్నారు. పొదుపు సంఘాల మహిళలతో కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడి గ్రూప్ రుణాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. 

గ్రామ సమస్యలు ఇవీ.

 గ్రామంలో తాగునీటి సమస్య ఉంది. వాటర్ ట్యాంకు సామర్ధ్యం సరిపోవడం లేదు. ట్యాంకర్ సక్రమంగారావడంలేదు.నేలటూరు రోడ్డు బాగా దెబ్బ తిన్నది. మరమత్తులు చేపట్టాల్సిన అవసరం ఉంది.

రెగ్యులర్ విద్యుత్ లైన్మెన్ లేకపోవడం వలన విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ ఆలస్యం కావడంతో గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారు. రెగ్యులర్ లైన్మెన్ ను నియమించాలి.

వేరే ఆధార్ నెంబర్ తో అన్నదాత - సుఖీభవ పథకం నగదు పొందుతున్నారు. అర్హులైన వారందరికీ అమలు చేయాలి.

స్వచ్చ భారత్ కింద మరుగుదొడ్లు ఉన్నప్పటికీ బహిరంగ మలవిసర్జన జరుగుచున్నది. గ్రామంలో బహిరంగ మలవిసర్జనను అరికట్టాలి.

చండ్రపాడు గ్రామంలో సైడు కాలువలు నిర్మించాల్సిన అవసరం ఉంది. అలాగే స్మశాన వాటిక ఆక్రమణకు గురైంది. దాన్ని సరిచేయాలి. అలాగే పొలానికి వెళ్ళే డొంక రోడ్డు పాడైంది. మరమత్తులు చేపట్టాల్సిన అవసరం ఉంది.

గ్రామంలో చాలా వరకు ఒక్కొక్క ఇంటిలో రెండు, మూడు కుటుంబాలు జీవిస్తున్నాయి. కొత్తగా ఇళ్లు మంజూరు చేయాలి.

కుటుంబ సభ్యుల మ్యాపింగ్ లో లోపం వలన ప్రభుత్వ పథకాలు రావడం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలి

ఈ సమస్యల పరిష్కారానికి తక్షణమే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

 శాసనసభ్యులు మాట్లాడుతూ చండ్రపాడు గ్రామానికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికార యంత్రాంగం రావడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక సంబంధమైనవికాని సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇళ్ల స్థలాలు, స్మశాన సమస్యను పరిష్కరించాలన్నారు. అవసరం మేరకు స్కూల్, అంగన్వాడీలలో నిర్మాణ పనులు, గుడిపాడుకు రోడ్డు, తదితర సదుపాయాలను కూడా త్వరగా చేపట్టేలా చూడాలని కోరారు.

జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ గ్రామంలో రీసర్వే కార్యక్రమం జరుగుతోందన్నారు. అర్హులైన రైతులు వినియోగించుకోవాలని ఆమె కోరారు. రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. 

ముందుగా గ్రామంలోని సీతారామ స్వామి ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న, జడ్పీ సీఈవో చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post