స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
ఒంగోలు,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి డా. బాబు జగ్జీవన్ రామ్ గారి కృషి నేటి యువతకు స్ఫూర్తిదాయకమని బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.
ఆదివారం బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని సాంఘిక సంక్షేమ శాఖ ఆద్వర్యంలో ఒంగోలు నగరంలోని డా.బి.ఆర్. అంబేద్కర్ భవనము నందు జరిగిన కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ శ్రీ పి.రాజాబాబు, సంతనూతలపాడు శ్రీ బిఎన్ విజయ కుమార్, వివిధ దళిత సంఘాల నాయకులతో కలసి జ్యోతి ప్రజ్వలన గావించి, డా.బాబు జగ్జీవన్ రామ్ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసి చరిత్రలో నిలిచిపోయిన మహనీయులు డా. బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. ఈ రోజు పండుగ వాతావరణంలో డా. బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతిని జరుపు కుంటున్నామన్నారు. డా. బాబు జగ్జీవన్ రామ్ గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, దేశానికి ఆయన చేసిన సేవలు నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. బీహార్ రాష్ట్రం లోని మారుమూల గ్రామంలో పుట్టి అతిపెద్ద విశ్వవిద్యాలయాల్లో చదువుకుని, తన స్వయంకృషి, పట్టుదలతో దేశ ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన మహనీయుడని కొనియాడారు. ఆయన స్పూర్తితో బడుగు, బలహీన వర్గాల యువత చదువులో రాణించి ఉన్నత లక్ష్యాలను అందుకోవాలని కోరారు. కేంద్రమంత్రిగా పని చేసిన సమయంలో అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు, కార్మికులు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు కోసం విశేషంగా కృషి చేసిన గొప్ప నాయకుడని అన్నారు. భారతదేశ చరిత్రలో సుమారు 30 సంవత్సరాలు కేంద్రమంత్రులు గాను, ఉపప్రధాని మంత్రిగా పని చేసి ఆయా శాఖలలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టి, తనదైన ముద్రను వేశారని అన్నారు. బడుగు,బలహీన వర్గాలు కోసం అలుపు ఎరగని పోరాడిన మహోన్నత వ్యక్తని కొనియాడారు. దేశంలో హరిత విప్లవం, నీలి విప్లవం తీసుకురావడంలో ఆయన కృషి చిరస్మరణీయమని, అలాగే బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ సమయంలో ఆయన ప్రదర్శించిన స్పూర్తి దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని భావితరాలకు మార్గదర్శకులుగా ఉండాలని, మన పిల్లలను బాగా చదివించుకుని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పి4 విధానాన్ని తీసుకువచ్చి పేదల ప్రజల అభ్యున్నతికి కృషిచేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, వాటిని అందిపుచ్చుకుని పేదప్రజలు అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.
జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు మాట్లాడుతూ, ఈ రోజు చాల చాల మంచి రోజు, ఏప్రిల్ నెల అంతా కూడా మహనీయులు జన్మించిన రోజు, అలాగే ఆ మహనీయుల ఆశయాలను, దిశానిర్దేశం ఇచ్చిన నెలగా మనం జరుపుకుంటామన్నారు. డా. బాబు జగ్జీవన్ రామ్ గారు, డా బిఆర్ అంబేద్కర్ గార్లను మనం రెండు కళ్ళుగా చూస్తామన్నారు. ఎందుకంటే వారందరూ సమకాలిక జీవితంలో సమకాలిక పరిస్థితుల్లో వచ్చి రాబోవు తరానికి చేరగనిముద్రగా నిలిచిపోయిన మహనీయులు. ఆనాడు ఉన్న పరిస్థితుల్లో వున్న కులవివక్ష, అసమానతలపై పోరాడి ఒక నాయకుడిగా ఎదిగి అత్యున్నత స్థానాని చేరుకున్న మహనీయులు డా. బాబు జగ్జీవన్ రామ్ గారని అని అన్నారు. డా. బాబు జగ్జీవన్ రామ్ గారు చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి సుదీర్ఘకాలం పాటు పార్లమెంట్లో కార్మిక శాఖ మంత్రిగా, రక్షణ శాఖ , వ్యవసాయ శాఖ, రైల్వే తదితర మంత్రిత్వ శాఖలో సేవలందించి ఆ శాఖలకు వన్నె తెచ్చిన మహనీయులని, వారి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఎంతో కొంత తోటివారికి సహాయం చేసి ఆయన బాటలో పయనించాలని ఆయన కోరారు. సమాజంలో మార్పు మన నుంచే రావాలన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నదని, ఆ అవకాశాలను అందిపుచ్చుకుని బడుగు బలహీన వర్గాల ప్రజలు చదువుతో పాటు పారిశ్రామికంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.
సంతనూతలపాడు శాసన సభ్యులు బిఎన్ విజయ కుమార్ మాట్లాడుతూ, చదువు అనేది ముఖ్యమని, మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చదువు చాల ముఖ్యమన్నారు. డా. బాబు జగ్జీవన్ రామ్ గారు ఇంతపెద్ద నాయకుడు అయ్యారంటే దానికి చదువు కూడా ఒక కారణమని చెప్పవచ్చు. చదువు ఆలోచన శక్తి ని ఇస్తుందన్నారు. చదువుకుంటే దళితులు ఏ స్థాయికైనా ఎదగతారు, ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు అనేది డా. బాబు జగ్జీవన్ రామ్ గారి జీవితాన్ని చూస్తే అర్ధమౌతుందన్నారు. ఎన్నో శాఖలకు మంత్రిగా పనిచేసిన జగ్జీవన్ రామ్ దేశ అభివృద్దికి ఎంతో కృషి చేశారన్నారు. ఆహార భద్రత కల్పించే విషయంలో ఆయన చేసిన కృషి ఎంతో ఉందన్నారు. నేటి యువత జగ్జీవన్ రామ్ ను స్పూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు.
ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిడి. లక్ష్మా నాయక్, ఆర్ డి ఓ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, డ్వామా పిడి.జోసెఫ్ కుమార్, ఎపిఎంఐపి పిడి శ్రీనివాసులు, డిపిఓ వెంకటేశ్వర రావు, వివిధ దళిత సంఘాల నాయకులు, ప్రతినిధులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, శ్రీ నీలం నాగేంద్ర రావు, తోరటి ఆనంద మాదిగ, చప్పిడి వెంకట్రావు , జే ఆంజనేయులు, చప్పిడి రవి శంకర్ , కోటి మాదిగ.చప్పిడి కోటేశ్వర రావు, కత్తి కళ్యాణ్, కొమ్ము సుజన్ మాదిగ, పెద్దపోగు కోటేశ్వర రావు, రవి, శ్రీ సుదీర్ , పాలడుగు రమేష్ తదితరులు ప్రసంగిస్తూ , డా. బాబు జగ్జీవన్ రామ్ గారు బడుగువర్గాల అభ్యున్నతికి, దేశానికి చేసిన సేవలను వారు గుర్తుచేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్.పి రాజాబాబు, సంతనూతలపాడు శాసన సభ్యులు బి ఎన్ విజయకుమార్ సహపంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొని భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు, ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


