పిల్లలు ఈతకు వెళ్లకుండా జాగ్రత్త లు తీసుకోవాలి- ఎస్పి.


పిల్లలు ఈతకు వెళ్లకుండా జాగ్రత్త లు తీసుకోవాలి- ఎస్పి.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

వేసవి సెలవుల్లో సరదా కోసం ఈతకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి: ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్.

పిల్లలు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరిన జిల్లా ఎస్పీ

పరీక్షలు ముగిసి వేసవి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు, చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంగళవారం ఒక ప్రకటనలో జిల్లా ఎస్పీ కోరారు. సరదా కోసం పిల్లలు, యువకులు గ్రామాలు, పట్టణాల శివార్లలోని కుంటలు, చెరువులు, కాలువలు, బావుల వద్దకు లేదా ఈతకు వెళ్లకుండా జాగ్రత్తపడాలని సూచించారు. గతంలో ఇలాంటి ప్రమాదకర జలాశయాల్లోకి వెళ్లి పలువురు మృత్యువాత పడి కుటుంబాలకు తీరని విషాదం మిగిల్చిన సంఘటనలు ఉన్నాయని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని కోరారు.

ఈతకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సరదాగా వెళ్లిన పిల్లలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని జిల్లా ఎస్పీ , హెచ్చరించారు. వేసవి సెలవుల్లో పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో తల్లిదండ్రులు గమనిస్తూ, వారు ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈత రాకపోతే కలిగే ప్రమాదాల గురించి చిన్నారులకు అవగాహన కల్పించాలని సూచించారు.

జలాశయాలు, బావులు, కాలువలు, చెరువులు, కుంటల్లో ఈత కొట్టేముందు, ఈత తెలిసిన వారు కూడా నీటి లోతును కర్రల సాయంతో ముందుగా పరిశీలించుకోవాలన్నారు. నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉంటే ఈతకు వెళ్లకూడదని, విహారయాత్రలు లేదా తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు లోతు తక్కువగా ఉన్న ప్రదేశాల్లోనే స్నానం చేయాలని, లోపలికి వెళ్లరాదని, ఈత రాకపోయినా స్నేహితులు బలవంతం చేయకూడదని స్పష్టం చేశారు.

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో చెరువులు, కొలనులు, జలపాతాలు, నీటి కుంటలు, ఏరుల వద్దకు ఎవరూ ఈతకు వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ , ఆదేశించారు.

 చెరువులు, బావులు, కాలువల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, నీటి లోతును తెలియజేసే సూచనలు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట ముళ్ల కంచెలు ఏర్పాటు చేయాలని సూచించారు. 

అలాగే చిన్నారులు ఈతకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా ప్రమాదం సంభవించిన వెంటనే డయల్ 112 కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post