కార్పొరేట్ జూనియర్ కాలేజీలలో ముందస్తు అడ్మిషన్స్ నిలుపుదల చెయ్యాలి - AIYF.


 కార్పొరేట్ జూనియర్ కాలేజీలలో ముందస్తు అడ్మిషన్స్ నిలుపుదల చెయ్యాలి - AIYF.

తెలంగాణా. ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు 2026-27 విద్య సంవత్సర అఫిలియేషన్ పూర్తి చేయకుండానే చేపడుతున్న ముందస్తు అడ్మిషన్ల ప్రక్రియను నిలుపుదల చేయాలి.

ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న కళాశాలల గర్తింపును రద్దు చేయాలి.

ఇంటర్ బోర్డ్ జాయింట్ కార్యదర్శికి ఏఐవైఎఫ్ బృందం ఫిర్యాదు.

ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి డిమాండ్.

        ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలల 2026-27 విద్య సంవత్సర అఫిలియేషన్ పూర్తి చేయకుండానే చేపడుతున్న ముందస్తు అడ్మిషన్ల ప్రక్రియను నిలుపుదల చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లేని జూనియర్ కళాశాలల జాబితాను ఇంటర్మీడియట్ విద్య మండలి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి సంయుక్త కార్యదర్శి వసుంధర దేవి కి ఏఐవైఎఫ్ బృందం ఫిర్యాదు చేశారు.

        ఈ సందర్భంగా *ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు,ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ,కల్లూరు ధర్మేంద్ర*. మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు 2026-27 విద్య సంవత్సర అఫిలియేషన్ పూర్తి చేయకుండానే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించడం సరికాదన్నారు. నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులు అనుమతులు ఉన్న కళాశాలలోనే చేరాలి. కానీ, కార్పొరేట్ కళాశాలల మాయాజాలం కారణంగా విద్యార్థులు అనుమతులు మంజూరు కాని కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకోవడం వలన నష్టపోతున్నారన్నారు. అడ్మిషన్ ఒక చోట... తరగతులు ఒక చోట నిర్వహిస్తూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఈ కార్పొరేట్ కళాశాలలు మోసం చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. కళాశాలల అఫిలియేషన్ ప్రక్రియను ఇంటర్ బోర్డ్ అధికార యంత్రాంగం పూర్తి చేయకపోతే విద్యార్థులకు ఇంటర్ బోర్డ్ ఏ ఏ కళాశాలలకు అనుమతులు మంజూరు చేసిందో తెలియక అయోమయంలో పడే ప్రమాదం ఉన్నదన్నారు. అనుమతులు పొందని కళాశాలల్లో అడ్మిషన్లు పొందితే విద్యార్థులు తమ విద్యా భవిష్యత్ ను నష్ట పోయే ప్రమాదమున్నదని వారు అన్నారు. 

        అదేవిధంగా కార్పొరేట్ కళాశాలలు ధన దోపిడీకి తెరలేపాయని లక్షలాది రూపాయలు ఫీజుల రూపంలో విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుండి వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు.ప్రత్యేక బ్యాచ్ల ఆకర్షణ అంటూ సాధారణ తరగతులకు భిన్నంగా.. అత్యంత ప్రతిభావంతుల కోసం అంటూ అనుమతులు లేని ఐపీఎల్, ఐకాన్, నియాన్, పాస్ట్ ట్రాక్, కో స్పార్క్ లాంటి అనధికార సెక్షన్లు అంటూ విద్యార్థులను అయోమయంలో పడేస్తున్నారని ధ్వజమెత్తారు, ప్రత్యేక విభాగాలను ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను బురిడీకొట్టించడం సాధారణంగా తయారైందన్నారు. ముందస్తుగా సీటు బుక్ చేసుకుంటే ఫీజులో 20 నుండి 40 శాతం వరకు తగ్గింపు ఇస్తామని ఆశ కలిగిస్తున్నారని, పరిమిత సీట్లంటూ జేఈఈ, మెడిసన్ ర్యాంకుల హామీలు, క్యాంపస్లో చేరితే ఐఐటీల్లో సీటు గ్యారెంటీ అంటూ ఆరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని ధ్వజమేత్తారు. విద్యార్థుల కంటే ఎక్కువగా తల్లిదండ్రుల బలహీనతలను, వారి భవిష్యత్తు ఆందోళనలను ఈ సంస్థలు క్యాష్ చేసుకుంటున్నారని వారు ఆరోపించారు. కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టడానికి అన్ని కళాశాలలలో మానసిక నిపుణుల కమిటీలు వేసేలా బోర్డ్ ఆదేశాలు జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు.తక్షణమే ఇంటర్ బోర్డ్ కార్పొరేట్ కళాశాలల ఆగడాలను ఆపాలని, లేనిపక్షంలో బోర్డ్ ఆదేశాలను భేకాతరు చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై దాడులు చేస్తామని దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు.

       ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర సమితి సభ్యులు షేక్ మహమూద్ పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post