దారిలో ఇసుక తీయమనందుకు ఒక కుటుంబం పై దాడి చేసిన విలేఖరి.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం మండలంలోని దర్గా గ్రామంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన మన్నేపల్లి ప్రసాద్ (వార్డెన్) కుటుంబంపై అదే గ్రామానికి చెందిన పాపిశెట్టి వీరయ్య (విలేఖరి )అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గ్రామంలో ఒక ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్న సందర్భంగా ఆ ఇంటికి సంబంధించిన ఇసుకను రహదారి మధ్యలో పోసి వాహనాలు, ప్రజలు వెళ్లడానికి ఇబ్బంది కలిగేలా ఉంచినట్లు తెలుస్తోంది.
ఈ విషయం గమనించిన మన్నేపల్లి ప్రసాద్, రోడ్డుపై ఇసుక అవసరం లేకుండా ఉంచడం వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతోంది, కొంచెం పక్కకు జరపండి అని సూచించినట్లు సమాచారం.
అయితే ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాపిశెట్టి వీరయ్య, ప్రసాద్ ఇంట్లో పురుషులు లేని సమయంలో మద్యం సేవించి వచ్చి ఇంట్లో ఉన్న మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు గ్రామస్తులు తెలిపారు.
మహిళలపై అసభ్య పదజాలంతో దూషిస్తూ బూతులు మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనలో ఇంటి ప్రహరీ గోడపై ఉన్న డిష్ వైర్‌ను కూడా తెంచి పడేసినట్లు సమాచారం. ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించగా, నన్నెవరూ ఏమీ చేయలేరు, ఎవరికైనా చెప్పుకోండి అంటూ బెదిరించినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అంతేకాకుండా మన్నేపల్లి ప్రసాద్ భార్యతో తీవ్ర వాగ్వాదానికి దిగిన వీరయ్య, ఆమెపై చేయి చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ ఘటనలో ఆమె స్పృహ తప్పి పడిపోయి, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళను చూడడానికి వెళ్తున్న మన్నేపల్లి కుటుంబానికి చెందిన యువకులను కూడా మధ్య దారిలో అడ్డగించినట్లు తెలుస్తోంది.
పాపిశెట్టి వీరయ్యతో పాటు నారాయణ అనే వ్యక్తి కలిసి వారి బండిని , అడ్డగించి ఒకరి మెడలో ఉన్న టవల్‌ను లాగుతూ నిన్ను చంపుతాను, నన్నెవరూ ఏమీ చేయలేరు” అంటూ బెదిరించినట్లు బాధితులు తెలిపారు.
అంతేకాకుండా చొక్కా పట్టుకుని టవల్‌తో ఉరివేయడానికి ప్రయత్నించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గ్రామంలో ఈ ఘటనతో ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

