అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు , జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలను అర్పించిన భారతీయ స్వాతంత్య్ర సమరయోధుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు , 125వ జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, మరియు పోలీస్ అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ , మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లాలోని పడమటపల్లిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారని తెలిపారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కఠోర సంకల్పంతో 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తన ప్రాణాలను అర్పించారని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకై అహింసాయుత సత్యాగ్రహం ద్వారా ఆత్మబలిదానం చేసి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అవతరణకు మాత్రమే కాకుండా భారతదేశంలో భాషాప్రాయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కూడా కారణభూతుడయ్యారని తెలిపారు.
గాంధీ మార్గంలో నడుచుకుంటూ అనేక ఉద్యమాలలో ప్రముఖ పాత్ర వహించారని, సత్యం మరియు అహింస అనే ఉన్నత ఆశయాలతో హరిజనుల ఉద్ధరణకు కృషి చేశారన్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొని జైలుకు వెళ్లారన్నారు. ఆయన జీవితం నేటి తరానికి మార్గదర్శకంగా నిలిచి భవ్యమైన, భావోన్నత భవిష్య నిర్మాణానికి ప్రేరణగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రం మరియు దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని జిల్లా ఎస్పీ , ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఒంగోలు రూరల్ సీఐ శేషగిరి రావు, కందుకూరు సీఐ అన్వర్ భాష, సంతమాగులూరు సీఐ కె.వెంకటరావు, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు,ఆర్ఐ రమణారెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..
