ఎస్టీ చెంచు /యానాది వెట్టి చాకిరి కార్మికులకు విముక్తి – దళిత బహుజన రిసోర్స్ సెంటర్ స్వచ్ఛంద సంస్థ కృషి,
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
బాండెడ్ వర్కర్స్ కి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం కలెక్టర్,జాయింట్ కలెక్టర్.
ప్రకాశం జిల్లా కురిచేడు మండలం వి.వై కాలనీకి చెందిన చెంచు గిరిజన కుటుంబాలకు చెందిన 29 మంది బాండెడ్ లేబర్ కార్మికులు నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం కల్వకుర్తి రోడ్డుకు సమీపంలో ఉన్న ఒక బొగ్గు బట్టీలో గత పది సంవత్సరాలుగా బానిస కార్మికులుగా పనిచేయించబడుతున్నట్లు సమాచారం అందింది.
ఈ సమాచారం అందిన వెంటనే దళిత బహుజన రిసోర్స్ సెంటర్ (DBRC) స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.
అనంతరం ఈ విషయాన్ని ఇండియా లేబర్ లైన్ సంస్థతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ) దృష్టికి తీసుకువచ్చారు.
ఫిర్యాదు అందుకున్న వెంటనే ఆర్డీఓ ఆదేశాల మేరకు తెలకపల్లి తహసీల్దార్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ఎస్‌ఐ నరేష్ నేతృత్వంలోని పోలీస్ బృందం, జిల్లా కార్మిక శాఖ అధికారి రాజ్‌కుమార్, జిల్లా బాలల సంరక్షణ విభాగం (DCPU) అధికారి శ్రీశైలం కలిసి సంఘటన స్థలానికి వెళ్లి కార్మికులను విచారించారు.
విచారణలో చెంచు / యానాది కుటుంబాలు గత పది సంవత్సరాలుగా బొగ్గు బట్టీలలో బలవంతపు పని చేస్తున్నామని అధికారులకు తెలిపారు.
తమను అక్కడి నుండి రక్షించి స్వగ్రామానికి పంపించాలని అధికారులను భావోద్వేగంతో కోరారు.
అనంతరం అధికారులు మొత్తం ఆరు కుటుంబాలకు చెందిన పురుషులు, మహిళలు, పిల్లలు కలిపి 29 మందిని బాండెడ్ లేబర్ పరిస్థితుల నుండి రక్షించి, తదుపరి పునరావాస చర్యల కోసం జిల్లా కార్మిక శాఖ మరియు జిల్లా బాలల సంరక్షణ కమిటీకి అప్పగించారు.
అనంతరం వారిని సురక్షితంగా వారి స్వగ్రామమైన ప్రకాశం జిల్లా కురిచేడు మండలం వి.వై కాలనీకి తరలించడం జరిగింది.
ఈ ఘటనకు సంబంధించి బొగ్గు బట్టీ యజమాని లాలు పై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ విజయ్ కుమార్ మరియు ఎస్‌ఐ నరేష్ తెలిపారు.
అనంతరం రక్షించబడిన బాండెడ్ లేబర్ కార్మికులను ఈరోజు ఒంగోలు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తీసుకెళ్లి కలెక్టర్ పి.రాజబాబు ముందు వారి సమస్యలను వివరించారు. కార్మికులకు తక్షణంగా అవసరమైన సహాయం మరియు పునరావాస చర్యలపై కలెక్టర్ స్పందిస్తూ ఈ బాధ్యతలను జాయింట్ కలెక్టర్ కి అప్పగించారు.
జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి కార్మికులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కార్మికుల్లో శివ పార్వతి శివ దంపతులకు జన్మించిన రెండు నెలల పాపకు “ప్రేరణ” అనే పేరు నామకరణం చేయడం జరిగింది.
అనంతరం జాయింట్ కలెక్టర్ కల్పనా ఐసిడిఎస్ అధికారులను ఆదేశించి కార్మికులను తక్షణమే వారి గ్రామానికి పంపించేలా చర్యలు తీసుకున్నారు.
దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అల్లాడి దేవకుమార్ మాట్లాడుతూ గత రెండు నెలల క్రితం యానాది కమ్యూనిటీకి చెందిన ఇద్దరు బాలికలను బాతులు మేపే యజమాని భారీ నుండి విముక్తి కల్పించడం జరిగింది.
ఇది ప్రకాశం జిల్లాలో రెండో కేసు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్మిక శాఖ అధికారి గాయత్రి దేవి, దళిత బహుజన రిసోర్స్ సెంటర్ స్టేట్ కోఆర్డినేటర్ హేమలత, ఏరియా కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు, నాగమణి, ఇండియా లేబర్ లైన్ గుంటూరు జిల్లా ఇన్చార్జి అయాన్ సురేష్ బాబు, ప్రకాశం జిల్లా ఇన్చార్జి ఏ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

