ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా అద్దంకి:రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఇప్పటి వరకు పేదలకు రూ.1,000 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించినట్లు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. పేదల ప్రాణాలను కాపాడటంలో ముఖ్యమంత్రి సహాయనిధి కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పాల్గొని సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 103 మందికి సీఎం సహాయనిధి చెక్కులు అందజేయగా, మరో 15 మందికి ఎల్‌ఓసీ పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ... ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. అత్యవసర వైద్య చికిత్స అవసరమైన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా తగిన ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పలువురు నిరుపేదలకు ఈ నిధి ద్వారా చికిత్స అందించి ప్రాణాలను కాపాడుతున్నామని తెలిపారు.
బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ప్రజల ఆరోగ్య భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో వైద్యం, విద్య రంగాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వివరించారు.
మహిళాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి గొట్టిపాటి.
మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సంతమాగులూరులోని పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేకు కట్ చేసి మహిళలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడికి విచ్చేసిన తెలుగు మహిళలకు స్వయంగా కేకు తినిపించి వారిని అభినందించారు.
మహిళలు కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధిలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని మంత్రి తెలిపారు. మహిళల సాధికారత, విద్యా-ఉపాధి అవకాశాల పెంపుకు కూటమి ప్రభుత్వం కట్టబడి ఉందని ఈ సందర్బంగా పేర్కొన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన వారి ఉన్నతికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పాటుపడ్డారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, నాయకులు తదితరులు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

