పోలీస్ భద్రతతో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు అనకాపల్లి జిల్లాలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఎస్పీ తుహిన్ సిన్హా.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి, ఫిబ్రవరి :23
నేటి నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర పరీక్షలను విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో రాసేలా జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ పరీక్షల నిర్వహణపై జిల్లాలోని పోలీస్ అధికారులకు మరియు ఎస్.హెచ్.ఓ లకు కీలక ఆదేశాలు జారీ చేశారు:
జిల్లాలోని 34 థియరీ పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడమైనది.
ప్రతి కేంద్రం వద్ద మహిళా అభ్యర్థుల తనిఖీ (Frisking) కోసం కచ్చితంగా ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్/హెడ్ కానిస్టేబుల్‌ను నియమించడమైనది.
పరీక్షా కేంద్రాల పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంబంధిత మండల మెజిస్ట్రేట్ల ద్వారా 144 సెక్షన్ అమలు చేయాలని ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల పరిసరాల్లోని జెరాక్స్ సెంటర్లను పరీక్షా సమయంలో మూసివేయాలని స్పష్టం చేశారు.
విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు. ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతినకుండా పరీక్షా కేంద్రాల సమీపంలో లౌడ్ స్పీకర్లు, డీజేలు, ఆర్కెస్ట్రాలు మరియు బహిరంగ సభలకు అనుమతి లేదని ఎస్పీ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.
పరీక్షలు ముగిసిన తర్వాత పేపర్లను భద్రంగా స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చే ప్రక్రియలో ఎస్కార్ట్ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు.
సుమారు 26,644 మంది విద్యార్థులు హాజరవుతున్న ఈ పరీక్షల నిర్వహణలో ఏ విధమైన నిర్లక్ష్యం వహించినా సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని ఎస్పీ తుహిన్ సిన్హా హెచ్చరించారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆయన ఆకాంక్షించారు.
