ఏలూరు కోటదిబ్బలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాఠశాలలో ఓఎన్‌జిసి, ఆర్క్ సంస్థల సిఎస్‌ఆర్ ఫండ్స్‌తో ఏర్పాటుచేసిన ఏఐ ఎనేబుల్డ్ కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవం.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
ఏలూరు, జనవరి - 8...ప్రస్తుత ప్రపంచంలో కృత్రిమ మేధ - ఏఐ సర్వంతర్యామిగా రూపాంతరం చెందిందని, ఆ మేధస్సే మానవుని నిత్య జీవితానికి అవసరమైన అనేక కీలక సాంకేతికపరమైన అడుగులను వేయిస్తూ, బంగారు భవిష్యత్తు దిశగా పయనింపచేస్తోందని ఏలూరు ఎంపి పుట్టా మహేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఏలూరు కోటదిబ్బలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాఠశాలలో ఓఎన్‌జిసి, ఆర్క్ సంస్థల సిఎస్‌ఆర్ ఫండ్స్‌తో ఏర్పాటుచేసిన ఏఐ ఎనేబుల్డ్ కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపి పుట్టా మహేష్ కుమార్, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిలు,ఆర్టీసి విజయవాడ జోన్ - 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం రిబ్బన్ కట్ చేసి కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో విద్యార్ధుల నుండి పలు సమస్యలు తెలుసుకున్న ఎంపి,,, ఆయా సమస్యల పరిష్కారానికి చేపట్టిన చర్యలను వివరించారు. అనంతరం ఎంపి పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు రోజువారీ జీవితంలో, ముఖ్యంగా విద్యావ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోందన్నారు. దాన్ని గుర్తించే తాము ఏఐపై విద్యార్ధులకు సంపూర్ణ అవగాహనను పెంపొందించే లక్ష్యంతోనే అడుగులు వేస్తున్నామన్నారు. కేవలం కంప్యూటర్ ల్యాబ్‌ను ఏర్పాటుచేసి వదిలేయకుండా,,, సుశిక్షకులతో ఆ జ్ఞానాన్ని విద్యార్ధులకు అందించాలనే లక్ష్యానికి ఈ కంప్యూటర్ ల్యాబ్ ప్రతీక అని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా లభించేందుకు ఈ జ్ఞానమెంతో ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడిన ఎంపి పుట్టా,,, అదేలక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఒకపక్క యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తూనే,,, మరోపక్క ప్రజారోగ్యానికి పెద్దపీట వేయనున్నట్లు ఎంపి పుట్టా స్పష్టం చేశారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ విద్యార్ధులకు ఏం కావాలన్నది తెలుసుకుని, ఎలా దాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలనే విషయాన్ని ఎంపి పుట్టా ఎంతో సమర్థవంతంగా చేసుకుంటూ వస్తున్నారని చెప్పారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభించాలంటే విద్యార్ధి స్థాయి నుండి సాంకేతికపరమైన జ్ఞానాన్ని మెరుగుపర్చుకోవాలని విద్యార్ధులకు ఆమె సూచించారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ సాంకేతికపరమైన మెళుకువలు నేర్చుకుంటేనే విద్యార్హతలకు మరింత సార్థకత ఏర్పడే పరిస్థితి ప్రస్తుత కాలంలో నెలకొందన్నారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వంతో పాటూ దాతలు సమిష్టిగా ఒక్కటై కల్పిస్తోన్న సౌకర్యాలను, సదుపాయాలను సద్వినియోగం చేసుకొని,,, విద్యార్ధులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. సిద్ధాంతపరమైన సూత్రాలను బాధ్యతాయుతంగా ఆచరణలో పెట్టడం నైపుణ్యం కలిగిన వ్యక్తికే సాధ్యమన్న ఎమ్మెల్యే చంటి,,, అటువంటి అర్హతలన్నీ కలిగిన ఉన్నత విద్యావంతులు, పారిశ్రామిక వేత్తే ఎంపి పుట్టా మహేష్ కుమార్ అని కొనియాడారు. ఇదేసమయంలో ఏలూరులో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఎంపి పుట్టాకు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. కార్యక్రమంలో , ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, కో - ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్సెమ్మార్ పెదబాబు, ఏలూరు అర్బన్ తహశీల్దార్ గాయత్రీ దేవి, నాయకులు ఆర్‌ఎన్‌ఆర్ నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ రాజ్‌కృష్ణ, ఓఎన్‌జీసీ, ఆర్క్ సంస్థల ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు...

