గంజాయి అక్రమ రవాణా కేసులో 4 గురు నిందితులకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, ₹1,00,000/- జరిమానా: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).
పి. మహేశ్వరరావు.
అనకాపల్లి (చీడికాడ)డిసెంబర్:01 గంజాయి అక్రమ రవాణా కేసులో చీడికాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 2015లో నమోదు చేసిన కేసులో 4గురు నిందితులకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి ₹1,00,000/- చొప్పున జరిమానా విధిస్తూ, జరిమానా చెల్లించని పక్షంలో మరొక సంవత్సరం అదనపు సాధారణ జైలు శిక్షను విధిస్తూ, చోడవరం 9వ అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి ఎం.హరి నారాయణ సోమవారం తీర్పు వెలువరించారు.
*శిక్ష పడిన నిందితులు:*
*1. ధరావత్ రవి,* 32 సం., చిన్న వంగర గ్రామం, తొర్రూరు మండలం, వరంగల్ జిల్లా, తెలంగాణ
*2. మడ్డు నరసింహారాజు,* 32 సం., కె.నాయుడుపాలెం, రోలుగుంట మండలం
*3. దాలి బోయిన ఫల్గుణ,* 32 సం., అడివి అగ్రహారం, చీడికాడ మండలం
*4. బండారు సంతోష్,* 25 సం., ద్వారకా నగర్, నర్సీపట్నం
*కేసు నేపథ్యం*
2015 మార్చి 31 ఉదయం 7 గంటల సమయంలో, చీడికాడ ఎస్సై ఎం.బాబురావు మరియు సిబ్బంది పక్కా సమాచారం మేరకు అడివి అగ్రహారం గ్రామం వద్ద నిర్వహించిన దాడిలో, AP 36 TA 6345 నంబరు గల ఇన్నోవా కారులో 140 కేజీల గంజాయి (7 మూటలు) అక్రమ రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న నిందితులను మధ్యవర్తులు సమక్షంలో పట్టుకున్నారు.
తద్వారా రెండు మోటార్ సైకిళ్లు, నాలుగు మొబైల్స్ మరియు ₹46,000/- నగదును స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో నిందితులు ఏజెన్సీ ప్రాంతాల నుండి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, ఇతర ప్రాంతాలకు అధిక ధరకు విక్రయించే ఉద్దేశంతో రవాణా చేస్తున్నట్లు తేలింది.
అప్పటి ఎస్సై డి.విశ్వనాథం సమగ్ర దర్యాప్తు జరిపి, న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.చంద్రశేఖర్ సమర్థవంతంగా వాదనలు వినిపించగా, సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయస్థానం పై శిక్షలను విధించింది.
జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఈ కేసులో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పోలీసులు చేసిన కఠిన శ్రమకు నిదర్శనంగా పేర్కొన్నారు. అలాగే దర్యాప్తు అధికారి డి.విశ్వనాథం, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, చీడికాడ పోలీస్ సిబ్బంది, కోర్టు మానిటరింగ్ సెల్ సిబ్బందిని అభినందించారు.
