వంట గ్యాస్ అందించే డెలివరీ బాయ్స్ రసీదు కంటే ఒక్కరూపాయి డిమాండ్ చేసినా డీలర్లపై కఠిన చర్యలు-జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు, డిసెంబర్, 26 : వంట గ్యాస్ డెలివరీ సమయంలో చార్జీల పేరుతో వసూలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ హెచ్చరించారు. . స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో శుక్రవారం మహిళలకు ఉచిత గ్యాస్ పంపిణీ, రేషన్ సరుకుల పంపిణీ పై పౌర సరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది, రేషన్ షాప్ డీలర్లు, గ్యాస్ కంపెనీల డీలర్లతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ వంట గ్యాస్ అందించే డెలివరీ బాయ్స్ ప్రతి వినియోగదారునితో మర్యాదగా ప్రవర్తించేలా డీలర్లు పర్యవేక్షించాలని, రసీదు కంటే ఒక్కరూపాయి డిమాండ్ చేసినా, వసూలు చేసినా సంబంధిత డెలివరీ సిబ్బందితోపాటు , గ్యాస్ కంపెనీల డీలర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. గ్యాస్ పంపిణీ, రేషన్ పంపిణీలలో వినియోగదారులతో ఐవిఆర్ఎస్ (IVRS) ద్వారా వచ్చే వారి అభిప్రాయాలు తీసుకుంటామని, ఏ వినియోగదారుడైనా వంట గ్యాస్ అందించే డెలివరీ, రేషన్ సరుకులు అంశాలలో ఫిర్యాదు చేస్తే సంబంధిత వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన ప్రాంతాల్లోని 5 కేజీల ఎల్పీజీ కనెక్షన్లను 14.2 కేజీల కనెక్షన్లుగా మార్చే ప్రక్రియను (HPCL లబ్ధిదారుల జాబితా ప్రకారం) త్వరితగతిన పూర్తి చేయాలని ఏజెన్సీలను జేసీ అభిషేక్ గౌడ ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి విలియమ్స్, పౌర సరఫరాల సంస్థ అధికారి మూర్తి, గ్యాస్ ఏజెన్సీ ల ప్రతినిధులు, రేషన్ షాపు డీలర్లు, పౌర సరఫరాల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

