మండల స్థాయి అభివృద్ధి అధికారులతో సమావేశం
కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే సహించను కలెక్టర్.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
గ్రామాలు అభివృద్ధి చెందడం అంటే జిల్లా అభివృద్ధి చెందటమే. మండల స్థాయిలో అభివృద్ధి అధికారులుగా ఉన్న మీరు ఈ ప్రధాన కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎంత మాత్రమూ సహించను అని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు స్పష్టం చేశారు.
ఎస్సీ ప్రజలు మెజార్టీ గా ఉండే గ్రామాలలో ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన ( పీఎం - ఏజేఏవై ) పథకం అమలుపై శుక్రవారం ప్రకాశం భవనంలో ఆయన అధ్యక్షతన జిల్లాస్థాయి కన్వర్జేన్స్ కమిటీ సమావేశం జరిగింది.
వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఎంపీడీవోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మా నాయక్ మాట్లాడుతూ ఈ పథకంలో భాగంగా ప్రధానంగా గ్రామస్థాయిలో విద్యా, వైద్యం, త్రాగునీరు, పారిశుద్ధ్యం, సామాజిక భద్రత, గ్రామీణ రోడ్లు, ఇళ్ల నిర్మాణం, విద్యుత్, మెరుగైన వ్యవసాయ విధానాలు, ఆర్థిక సమ్మిళితం, డిజిటైజేషన్, నైపుణ్య అభివృద్ధి పెంపు, జీవనోపాధి కల్పన వంటి అంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుందన్నారు.
ఇందుకోసం సర్పంచ్ అధ్యక్షతన ఏర్పడే కమిటీలో సంబంధిత గ్రామ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికను రూపొందిస్తారు అన్నారు.
ఈ విధంగా గుర్తించిన పనులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో చేపడతారని చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులను మంజూరు చేసిందని, పనులను కూడా గుర్తించినప్పటికీ వాటిని చేపట్టకపోవడం, పూర్తి చేయడములో జాప్యం జరుగుతోందని ఆయన తెలిపారు.
దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఎంపీడీవోలు అంటేనే మండల స్థాయిలో అభివృద్ధి పనుల పర్యవేక్షణ అధికారులు. మీ ప్రధాన విధి పైన దృష్టి సారించకుండా ఏం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమన్వయం చేస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేయండి. అలాకాకుండా మొక్కుబడిగా చూస్తామంటే కుదరదని హెచ్చరించారు.
ప్రతివారం అభివృద్ధి కార్యక్రమాల పైన నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లో ఈ పథకాన్ని కూడా సమీక్షిస్తానని స్పష్టం చేశారు.
ఎస్సీ ప్రజలు మెజారిటీ ఉన్న గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను ఉపయోగించకుండా నిర్లక్ష్యం వహిస్తే విధుల నుండి సస్పెండ్ చేయాల్సివస్తుందనిహెచ్చరించారు.
ఫేజ్ - 1లో మంజూరైన పనులను త్వరగాపూర్తిచేయాలనిఆదేశించారు.
క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శుల పనితీరును కూడా నిరంతరం పరిశీలిస్తూ ఉండాలని ఎంపీడీవోలకు చెప్పారు. తాగునీరు, పారిశుధ్యంతో పాటు గ్రామస్థాయిలో ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రధాన బాధ్యత పంచాయతీ కార్యదర్శులదే అన్నారు. బాధ్యతలను విస్మరిస్తే ఎంతటి వారినైనా సహించబోనని కలెక్టర్ పునరుద్ఘాటించారు.
ఈ సమావేశంలో జడ్పీ సీఈవో చిరంజీవి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. బాలశంకరరావు, డి ఆర్ డి ఏ పిడి నారాయణ, డీఈవో కిరణ్ కుమార్, డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఎస్.ఈ. వరలక్ష్మి, ఏపీ సీపీడీసీఎల్ ఎస్ ఈ వెంకటేశ్వర్లు, పంచాయతీ రాజ్ ఎస్.ఈ. అశోక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Add


