డిజిటల్‌ అరెస్టు పేరిట విశ్రాంత ఉపాధ్యాయుడిని బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు - బంగారం అమ్మించి, అప్పు చేయించి మరీ రూ. 18.50 లక్షలు కాజేసిన కేటుగాళ్లు.




డిజిటల్‌ అరెస్టు పేరిట విశ్రాంత ఉపాధ్యాయుడిని బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు - బంగారం అమ్మించి, అప్పు చేయించి మరీ రూ. 18.50 లక్షలు కాజేసిన కేటుగాళ్లు.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన ఓ వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేసి ఎనిమిదేళ్ల కిందట పదవీ విరమణ పొందారు. ఈనెల 17న ఆయనకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఎయిర్‌టెల్‌ నుంచి మాట్లాడుతున్నామనీ, మీ సిమ్‌ రెండు గంటల్లో డీయాక్టివేట్‌ అవుతుందనీ, బెంగళూరులో మీ పేరున ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని అవతల వ్యక్తి చెప్పాడు. ఆ తర్వాత వీడియోకాల్‌ వచ్చింది. పోలీస్‌స్టేషన్‌ సెట్‌లో ఉన్న ఓ వ్యక్తి పరిచయం చేసుకుని తాను బెంగళూరులోని గాంధీనగర్‌ స్టేషన్‌ ఎస్సైనని చెప్పాడు.

సీబీఐ అధికారితో వీడియోకాల్ : ఈ ఏడాది జనవరి 2న మీ ఆధార్‌తో బెంగళూరులో సిమ్‌ తీసుకున్నారని చెప్పాడు. ముంబయిలో మీ పేరున ఖాతా తెరిచి ఉందనీ, ఇందులోకి ఓ నేరస్థుడి నుంచి రూ.30 లక్షలు బదిలీ అయ్యాయన్నాడు. ఈ డబ్బు మీ ఖాతాలో పడిందో లేదో తనిఖీ చేయాలని ఎస్సై వేషధారణలోని వ్యక్తి అన్నాడు. సీబీఐ కార్యాలయంలో ఉన్న ఇన్‌స్పెక్టర్‌ను లైన్‌లో కలుపుతానని వీడియోకాల్‌లో కనెక్ట్‌ చేశాడు. మేం చెప్పిన ఖాతాకు రూ.30 లక్షలు బదిలీ చేస్తే పరిశీలించాక మీవేనని తేలితే తిరిగి పంపిస్తామన్నారు.

బంగారు నగలు తాకట్టు పెట్టి మరీ : తన వద్ద అంత డబ్బు లేదని ఆయన బతిమిలాడినా వారు వినలేదు. ఇంట్లోని బంగారు నగలు తాకట్టు పెట్టి రుణం తీసుకోమని రెండు గంటలపాటు ఒత్తిడి తెచ్చారు. సోమవారం విస్సన్నపేటలోని కెనరా బ్యాంకుకు వెళ్లి నగలు తాకట్టు పెట్టి రూ.13.50 లక్షలు రుణం తీసుకుని మోసగాళ్లు చెప్పిన ఖాతాకు అదే బ్యాంకు నుంచి నగదును బదిలీ చేశారు. మిగిలిన డబ్బు పంపమన్నారు. దీంతో చేసేది లేక కనిపించిన వారినల్లా అడిగి రూ.5 లక్షలు సమకూర్చుకున్నారు. మంగళవారం మళ్లీ బ్యాంకుకు వెళ్లి ఈ డబ్బును మోసగాళ్లు సూచించిన మరో ఖాతాకు బదిలీ చేశారు. ఇంకా కావాలని అడుగుతుండటంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

‘గోల్డెన్‌ అవర్‌’ ఎంతో కీలకం : ఇలాంటి ఘటనలపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా చాలామంది ఇలాంటి మోసాలకు గురవుతున్నారని పోలీసులంటున్నారు. సాధారణంగా రోడ్డు ప్రమాదాలకు గురైన వారి ప్రాణాలు కాపాడేందుకు ‘గోల్డెన్‌ అవర్‌’ ఎంతో కీలకం. అలాగే సైబర్‌ నేరాల బాధితులు పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందడానికి, నేరగాళ్లను పట్టుకోవడానికి కూడా ‘గోల్డెన్‌ అవర్‌’ అంతే ముఖ్యమంటున్నారు. సైబర్‌ నేరం జరిగిన గంటలోగా బాధితులు ఫిర్యాదు చేయాలి. అప్పుడు కోల్పోయిన డబ్బును తిరిగి రాబట్టగలిగే అవకాశాలు ఎక్కువ. రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలలో సైబర్‌ నేరాలపై టోల్‌ఫ్రీ నంబరుకు 11,97,969 ఫిర్యాదులు అందాయి. 1,598 కేసులు నమోదయ్యాయి. రూ.1,402 కోట్లను బాధితులు పోగొట్టుకున్నారు. పలువురు నేరం జరిగిన మొదటి గంటలోపు ఫిర్యాదు చేయడంతో రూ.274 కోట్లు (19.54%) ఖాతాల్లో నుంచి నేరగాళ్లకు పోకుండా పోలీసులు స్తంభింపచేయగలిగారు. కొంత సొత్తును తిరిగి బాధితులకు ఇప్పించగలిగారు.


ఆలస్యం చేస్తే అంతే : సైబర్‌ నేరాల్లో కోల్పోయిన డబ్బుకు రికవరీ శాతం చాలా తక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం, సైబర్ నేరగాళ్లు ఆ డబ్బును కాజేసిన గంటల వ్యవధిలో వివిధ పేర్లతో ఉన్న వందల ఖాతాల్లోకి, ఇ-వ్యాలెట్లలోకి మళ్లిస్తారు. తరువాత అక్కడి నుంచి మళ్లీ వేరే ఖాతాల్లోకి పంపి చివరికి ATMల ద్వారా డబ్బును డ్రా చేస్తారు. లేదంటే ఆ డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చేసుకుంటారు. నిందితులు డబ్బు మళ్లించిన ఖాతాలు కూడా వివిధ రాష్ట్రాల్లో ఉంటాయి. దీంతో వాటిని గుర్తించినా రికవరీ సాధ్యం కావట్లేదు.

అయితే నేరం జరిగిన తొలి గంటలోగా బాధితులు ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే నిందితుల ఖాతాలున్న బ్యాంకుల్ని సంప్రదిస్తారు. బాధితుల ఖాతా నుంచి డబ్బు ట్రాన్స్‌ఫర్‌ కాకుండా స్తంభింపజేస్తారు. అప్పటికే డబ్బు నిందితుడి ఖాతాకు వెళ్తే తదుపరి లావాదేవీలు జరగకుండా ఆ ఖాతాను నిలువరిస్తారు.

ఎలా ఫిర్యాదు చేయాలి?: సైబర్‌ మోసానికి గురైన వెంటనే బాధితులు ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెల్‌ (ఐ4సీ) నిర్వహిస్తున్న 1930 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేయాలి. బాధితుడి బ్యాంకు ఖాతా నంబరు, నేరగాళ్ల ఫోన్‌ నంబరు, నగదు జమ చేసిన ఖాతా వివరాలను చెప్పాలి. దాంతో పాటు https://cybercrime.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫిర్యాదు నమోదు చేయొచ్చు. స్థానిక పోలీసుస్టేషన్‌ను సంప్రదించొచ్చు.

Post a Comment

Previous Post Next Post