జిల్లాలో సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని, ఎటువంటి కొరత లేదు - జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
ఏలూరు, జిల్లాలో సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని, ఎటువంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడికి తెలియజేసారు. రాష్ట్రంలో ఎరువుల సరఫరా పై అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం సెక్రటేరియట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎరువులకు ఎటువంటి కొరతా లేదన్నారు. సాగుకు సరిపడా ఎరువులను అన్ని జిల్లాల్లోనూ రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. రైతులందరికీ ఎరువులు సరఫరా అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎరువుల కృత్రిమ సృష్టించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. వ్యవసాయేతర అవసరాలకు యూరియా వినియోగాన్ని అరికట్టడానికి తగు చర్యలు తీసుకోవాలని, మోతాదుకు మించి ఎరువుల వినియోగం జరగకుండా వ్యవసాయ శాఖ సిబ్బంది పర్యవేక్షించాలన్నారు. ఎరువుల అక్రమ రవాణాను నివారించుటకు అంతర జిల్లా మరియు అంతర రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద కఠినమైన నిఘా ఏర్పాటు చేయాలని, అటువంటి చర్యలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనీ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుత వ్యవసాయ సీజన్ కు అవసరమైన ఎరువులు, డిఏపి నిల్వలు ఉన్నాయని, ఎటువంటి కొరతా లేదని, ఈ విషయాన్నీ గ్రామా స్థాయిలోని వ్యవసాయాధికారులు రైతులకు తెలియజేస్తున్నారన్నారు. . జిల్లాలో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, అక్రమంగా నిల్వ ఉంచేవారిపై కేసులు నమోదు చేస్తున్నామని, అంతేకాక ఎవరైనా డీలర్లు ఎరువులను బ్లాక్ మార్కెటింగ్ చేసినా, అధిక ధరలకు అమ్మినా వారిపై కేసులు నమోదు చేస్తున్నామని మంత్రికి తెలియజేసారు.
