అసత్య ప్రచారాలను ఖండించిన సూర్యతేజ విద్యాసంస్థలు.


అసత్య ప్రచారాలను ఖండించిన సూర్యతేజ విద్యాసంస్థలు.

దుష్ప్రచారాలపై చట్టపరమైన చర్యలు తప్పవు: ప్రిన్సిపల్ దానేటి పద్మజ.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి శంకర్ తమ్మినాన.

పలాస, ఆగస్టు 5: 

పలాసలోని సూర్యతేజ విద్యాసంస్థలపై ఇటీవల కొన్ని పత్రికలు, సోషల్ మీడియా వేదికల్లో ప్రసారమైన వార్తలు పూర్తిగా అవాస్తవమని, కల్పిత కథనాలేనని ఆ విద్యాసంస్థల ప్రిన్సిపల్ దానేటి పద్మజి స్పష్టం చేశారు. కళాశాల ఆవరణలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అనవసర ఆందోళన కలిగించేలా దుష్ప్రచారం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

కొద్దిరోజుల క్రితం కొత్తూరు కేజీబీవీలో చోటుచేసుకున్న ఘటనను సూర్యతేజ విద్యాసంస్థలకు ముడిపెడుతూ కొన్ని దినపత్రికతో పాటు కొన్ని సోషల్ మీడియా ఛానెళ్లు అసత్య కథనాలను ప్రచారం చేశాయని ఆరోపించారు. సంబంధిత విద్యార్థిని సెకండ్ ఇయర్ విద్యను పూర్తి చేసి ఈ ఏడాది ఫిబ్రవరి 20 నాటికే కళాశాల నుంచి రిలీవ్ అయిందని, అనంతరం ఆమె తల్లి స్వయంగా వచ్చి విద్యా సర్టిఫికెట్లు కూడా తీసుకెళ్లారని తెలిపారు. కళాశాల పరిధికి వెలుపల వ్యక్తిగతంగా జరిగే సంఘటనలకు విద్యాసంస్థకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు.

ఆరోపణలు వచ్చిన వెంటనే సంబంధిత సిబ్బంది నుంచి వివరణ కోరినట్లు, అనంతరం అతడిని తక్షణమే విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు. విద్యార్థుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.

విద్యాసంస్థల నిర్వహణకు అవసరమైన అన్ని ప్రభుత్వ అనుమతులు, గుర్తింపులు, అఫిలియేషన్లు, షిఫ్టింగ్ ఆర్డర్లు నిబంధనల మేరకు ఉన్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన అధికారిక పత్రాలను మీడియా ప్రతినిధులకు చూపించినట్లు వెల్లడించారు.

విద్యార్థినుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, కళాశాల ప్రాంగణంలో 36కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని చెప్పారు. 2023 నుంచి ఉమెన్స్ సెల్, యాంటీ ర్యాగింగ్ కమిటీ, ఈగల్ కమిటీ, ప్రతి నెల సమావేశమయ్యే ఇంటర్నల్ కాలేజ్ కమిటీ (ఐసీసీ) నిబంధనల ప్రకారం సమర్థంగా పనిచేస్తున్నాయని వివరించారు. నాన్-టీచింగ్ సిబ్బందికి విద్యార్థుల గదుల్లోకి ప్రవేశించే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

విద్యాసంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న రాజకీయ నాయకులు, తప్పుడు కథనాలను ప్రచురించిన పత్రికలు, సోషల్ మీడియా ఛానెళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ దానేటి పద్మజ హెచ్చరించారు. తల్లిదండ్రులు, విద్యార్థులు వాస్తవాలను మాత్రమే నమ్మాలని, ఎలాంటి అపోహలకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post