అనంతగిరి యువకుడు బందాపు తిరుమలకు AIBE-XXIలో విజయం.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.
పలాస, జూలై 19 (న్యూస్): వజ్రపుకొత్తూరు మండలం అనంతగిరి గ్రామానికి చెందిన బందాపు తిరుమల ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (AIBE-XXI – 2026)లో ఉత్తీర్ణత సాధించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలు శనివారం దేశవ్యాప్తంగా విడుదల కాగా, తిరుమల విజయం సాధించి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసేందుకు అర్హత పొందారు.
తిరుమల ఎచ్చెర్ల విశ్వవిద్యాలయంలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సును ప్రథమ శ్రేణిలో పూర్తి చేశారు. చదువులో ఎన్నో వ్యక్తిగత, కుటుంబ పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ లక్ష్యాన్ని వదలకుండా ముందుకు సాగారు. ఐదో సెమిస్టర్ పరీక్షల సమయంలో తల్లి మరణించగా, అంత్యక్రియలు పూర్తి చేసిన అనంతరం పరీక్షకు హాజరై తన సంకల్పాన్ని చాటుకున్నారు.
ఆయన భార్య మీనా డీఐఈటీ పూర్తి చేసి ప్రైవేట్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ, తిరుమల న్యాయ విద్యాభ్యాసానికి పూర్తి సహకారం అందించారు. ప్రధాన దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేస్తూ కుటుంబ బాధ్యతలను నిర్వర్తించిన తిరుమల, అదే సమయంలో జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీని కూడా పూర్తి చేశారు. వీరికి కుమార్తె ఈషా ప్రకృతి, కుమారుడు హైందవ్ ఉన్నారు. ఆయన సోదరుల్లో ఒకరు పోలీసు శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
AIBEలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా బందాపు తిరుమల దేశంలోని జిల్లా కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులో అధికారికంగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే అర్హతను పొందారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో లీగల్ ఆఫీసర్, లీగల్ అడ్వైజర్ తదితర న్యాయ సంబంధిత ఉద్యోగాలకు కూడా అర్హత సాధించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, మిత్రులు, సహచర జర్నలిస్టులు, న్యాయవాదులు, స్వగ్రామ ప్రజలు బందాపు తిరుమలను అభినందిస్తూ, న్యాయరంగంలో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
